నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు”. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో నవీన్ చంద్ర విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో భానుమతి & రామకృష్ణ చేశాను. ఈ చిత్రానికి చాలా మంచి పేరు వచ్చింది. మంత్ ఆఫ్ మధు సినిమాలో సహజత్వానికి చాలా దగ్గర వుండే పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర పేరు మధుసూధనరావు. చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ అతన్ని హీరోలా చూస్తుంటారు. ఐతే కాలం గడిచిన కొద్ది ఎవరి జీవితాల్లోకి వారు వెళ్ళిపోతారు. మధు మాత్రం అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండిపోతాడు. మందు, సిగరెట్ కి అలవాటు పడిపోతాడు. ఒకరి కింద ఉద్యోగం చేయాలని వుండదు. తనకి డబ్బు పై కూడ ఆశ లేదు. తనకి ఏ లక్ష్యం వుండదు. ఏ భాద్యత తీసుకోడు. చిన్నప్పటి నుంచి అందరూ ఒక హీరో ఇమేజ్ తో చూడటంతో అందులోనే ఉండిపోతాడు.
ఒక వ్యక్తికి లేని బిల్డప్ ని చుట్టూ ఉన్న వాళ్ళు ఇవ్వడం మనం గమనిస్తుంటాం. అదే నిజం అనుకుని అందులోనే వుండిపోయే పాత్రలు మనకు నిజ జీవితంలో ఎదురౌతుంటాయి. ఇందులో మధు పాత్ర కూడా అలానే ఉంటుంది. కథ నచ్చి ఎంచుకున్న సినిమా ఇది. 'మంత్ ఆఫ్ మధు చాలా స్పెషల్ మూవీ. ఇందులో మధుమతి పాత్ర యుఎస్ ఎన్ఆర్ఐ. తను అక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి. అక్కడ చాలా ఇండిపెండెంట్ గా పెరుగుతారు. అక్కడ కల్చర్ కి అలవాటు పడిన వారికి ఇండియా కల్చర్ కి తగ్గట్టు బిహేవ్ చేయమని చెప్పడం కష్టం. ఆ అమ్మాయి యుఎస్ లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే వుంటుంది.
స్వాతి తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. తెలుగు అమ్మాయి ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ పాత్రలో పెయిన్ ఉంటుంది. ఈ కథ చాలా యూనిక్ గా వుంటుంది. ఈ సినిమాలో పాత్రల ప్రయాణం, వారి ఛాయిస్ లని చూపించబోతున్నాం.