తను చెప్పాల్సింది తను చెబుతున్నా… తెలివిగా కాపులను, జనసైనికులను తను అనుకున్న దారిలోకి మళ్లిస్తున్నా అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. అందుకోసం ఆయన కొన్ని సూక్తి ముక్తావళి వాక్యాలను ఎంచుకున్నారు. పదే పదే అవి తన ప్రసంగంలో అక్కడక్కడ దొర్లేలా చూసుకుంటున్నారు. కానీ తను వెనుక తన పార్టీ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో, కాపులు ఎలా ఫీలవుతున్నారో గమనించడం లేదు. తన మాటల రియాక్షన్ ఎలా వుందో చూసుకోవడం లేదు.
ఇంతకీ పవన్ చెబుతున్నది ఏమిటి?
తెలుగుదేశం కష్టాల్లో వుంది.
అలా అని దాని అనుభవాన్ని తక్కువ అంచనా వేయద్దు
కష్టంలో మన దగ్గరకు వచ్చిందని చులకన చేయద్దు
కులాలను దాటి ఆలోచించండి అధికారం ఎవరు అందుకుంటారు అన్నది ఎన్నికల తరువాత ఆలోచిద్దాం
పొత్తు లెక్కలు నాకు వదిలేయండి జనసేన-తెలుగుదేశం అని చెబుతాను.. అలాగే చెప్పండి
అధికారం ఒక్కసారిగా అందదు మాయవతి చాలా ఏళ్లు పోరాటం చేసాక సిఎమ్ అయ్యారు.
ఇవి మచ్చుకు కొన్ని.
కానీ దీని వల్ల కాపుల్లో, పవన్ అభిమానుల్లో నిరాశ స్టార్ట్ అయిందన్న సంగతి పవన్ గమనించడం లేదు. అటు పవన్ అభిమానులు కానీ, ఇటు కాపులకు కానీ కావాల్సింది జనసేన అధికారం చేపట్టడం, పవన్ సిఎమ్ కావడం. కానీ ఇప్పుడు పవన్ చెబుతున్నది చూస్తుంటే అస్సలు ఆ సీన్ నే లేదని ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది.
తెలుగుదేశాన్ని గెలిపించి, అధికారం ఎక్కించడమే లక్ష్యంగా పవన్ పని చేస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. అయినా పవన్ వెంటే వుండాలా? పవన్ కోసం వైకాపాను ఓడించాలా? వద్దా? అన్నది ఇప్పుడు తేల్చుకోవాల్సిన సంగతి. పవన్ ముఫై లేదా నలభై సీట్లలో తన పార్టీ అభ్యర్ధులను నిలబెట్టే అవకాశం వుంది. కానీ అన్ని సీట్లు తేదేపా ఇస్తుందా అన్నది అనుమానం.
ఎందుకంటే తేదేపా లేదా వైకాపా అనుకూలంగా వస్తున్న ఏ సర్వే లో కూడా జనసేనకు రెండు అంకెల నెంబర్ రావడం లేదు. అలాంటపుడు ముఫై, నలభై స్థానాలు ఎందుకు ఇస్తుంది తెలుగుదేశం. కాదూ అంటే పరువు దక్కించుకోవడం కోసం, కండువా జనసేనది కావాల్సి వుంటుంది. అలా చేసినా కూడా సమస్యే. ఎందుకంటే ఆయా స్థానాల్లో జనసేన టికేట్ కావాలని అనుకుంటున్న వారు వున్నారు కదా. వాళ్లు కచ్చితంగా నాన్ కోపరేటివ్ కాక తప్పదు
ఇక ఆ సంగతి అలా వుంచితే, జనసేన పోటీ చేయని స్థానాల పరిస్థితి ఏమిటి? వన్స్ ఆ స్థానాల సంగతి తేలితే అసలు లెక్కలు మొదలవుతాయి కదా. తెలంగాణలో కనీసం ఒక టూర్ కూడా చేయకుండానే పోటీ చేసే స్థానాలు ప్రకటించారు కదా పవన్. అదే పని ఆంధ్రలో కూడా చేయవచ్చు కదా.. ప్రస్తుతం జనసేన ఫాలోవర్లు, కాపులు ఈ క్షణం కోసమే చూస్తున్నారు. పవన్ పార్టీ పోటీ చేసే స్థానాలు క్లారిటీ వస్తే కొత్త సర్వేలు చేసుకోవచ్చు.
అప్పుడు తెలుగుదేశం- జనసేన కాంబినేషన్ మీద కొత్త లెక్కలు వస్తాయి. కానీ ఆ సంగతి పవన్ కు తెలిసో, తెలియదు. ఆయన మాత్రం కాపులను, జనసేన జనాలను హిప్నటైజ్ చేసే విధంగా తాను అనుకుంటున్నది, తాను చెప్పాలనుకుంటున్నది, తనకు వచ్చిన డైరక్షన్ మేరకు తాను చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు. పవన్ ఇవే మాటలు వల్లె వేస్తూ ముందుకు వెళ్తే చాలా అంటే చాలా బెటర్.. అది వైకాపా కు. అందువల్ల పవన్ మాట్లాడడమే మంచిది.