మ‌హిళా ఉద్యోగుల వద్ద నోరు జారిన‌ పేర్ని నాని

మ‌హిళా ఉద్యోగుల వ‌ద్ద మంత్రి పేర్ని నాని నోరు జారారు. ఉద్యోగుల డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌లేని నిస్స‌హాయ‌త‌ను చెప్పుకునే క్ర‌మంలో త‌న‌కు తానుగా రాష్ట్రం దివాళా తీసింద‌ని మంత్రి నాని వెల్ల‌డించ‌డం దుమారం చెల‌రేగుతోంది.  మంత్రి…

మ‌హిళా ఉద్యోగుల వ‌ద్ద మంత్రి పేర్ని నాని నోరు జారారు. ఉద్యోగుల డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌లేని నిస్స‌హాయ‌త‌ను చెప్పుకునే క్ర‌మంలో త‌న‌కు తానుగా రాష్ట్రం దివాళా తీసింద‌ని మంత్రి నాని వెల్ల‌డించ‌డం దుమారం చెల‌రేగుతోంది.  మంత్రి పేర్ని తానేదో నాని ఆస‌క్తిక‌ర క‌థ చెప్పాన‌ని సంతోషించారే త‌ప్ప తానెంత త‌ప్పు చేశారో ఇప్పుడిప్పుడు తెలిసి వ‌చ్చి వుంటుంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 

ఎదుటి వాళ్ల‌ను త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకునే నేర్ప‌రిత‌నం పేర్ని నాని సొంతం. జ‌గ‌న్ కేబినెట్ ఏ విష‌యాన్నైనా జ‌నానికి చేర‌వేయ‌డంలో పేర్ని నాని త‌ర్వాతే ఎవ‌రైనా. అలాంటి మంత్రే త‌ప్పులో కాలేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల డిమాండ్ల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఆదివారం అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు వెళ‌తామ‌ని ఉద్యోగులు హెచ్చ‌రించ‌డం, మ‌రోవైపు చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

ఇక‌పై ఉద్యోగుల ఉద్య‌మం తీవ్ర‌తరం కాకుండా వెంట‌నే చ‌ర్చ‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని మంత్రుల క‌మిటీకి సీఎం జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌ల‌తో గ‌త రెండు రోజులుగా మంత్రుల క‌మిటీ కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపింది. చ‌ర్య‌లు ఫ‌ల‌వంత‌మైన సంగ‌తి తెలిసిందే. చ‌ర్చ‌ల్లో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చిస్తుండ‌గా ముఖ్య‌మైన కాల్ రావ‌డంతో నాని బ‌య‌టికెళ్లి మాట్లాడారు.

ఇదే సమ‌యంలో అక్క‌డ వేచి ఉన్న మ‌హిళా ఉద్యోగులు, నాని మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మ‌హిళా ఉద్యోగుల‌కు మంత్రి నాని ఓ క‌థ చెప్పారు. అలాగే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఉద్యోగుల‌కు మంత్రి మొర పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌హిళా ఉద్యోగుల‌తో నాని చెప్పిన క‌థేంటో తెలుసుకుందాం.

ఐఆర్ 27 శాతం ఇచ్చి, పిట్‌మెంట్ 23 శాతానికి త‌గ్గించ‌డం ఏంటి? ఎప్ప‌టి నుంచో ఉన్న హెచ్ఆర్ఏని ఇప్పుడు త‌గ్గించ‌డం ఏంట‌ని మంత్రిని మ‌హిళా ఉద్యోగులు ప్ర‌శ్నించారు. మంత్రి స్పందిస్తూ…రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఘోరాతిఘోరంగా ఉంద‌ని వాపోయారు. అందుకే ఉద్యోగుల డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌లేక పోతున్నామ‌న్నారు. నిజంగా ఆర్థిక ప‌రిస్థితి బాగుంటే ఈ ప‌రిస్థితి తెచ్చుకునే వాళ్లం కాద‌న్నారు.

ప‌దో త‌ర‌గ‌తిలో ఫ‌స్ట్ క్లాస్ తెచ్చుకుంటే స్కూట‌ర్ కొనిస్తాన‌ని కుమారుడికి ఓ తండ్రి చెప్పాడ‌న్నారు. అయితే ఫ‌స్ట్ క్లాస్‌లో కొడుకు పాస్ అయ్యే స‌మ‌యానికి తండ్రి ఆర్థికంగా దివాళా తీశాడ‌న్నారు. అయితే స్కూట‌ర్ కొనిస్తాన‌ని తండ్రి ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌లేద‌ని కొడుకు తిట్టుకుంటే మాత్రం చేయ‌గ‌లిగేదేముంద‌ని మంత్రి నాని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం కొడుక్కు స్కూట‌ర్ హామీ ఇచ్చిన తండ్రి ప‌రిస్థితి లాగే ప్ర‌భుత్వ ప‌రిస్థితి ఉంద‌ని నాని చెప్పుకొచ్చారు.

ఈ క‌థ‌లోని నీతి ఏంటంటే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింద‌ని ఇంత కాలం ప్ర‌తిపక్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లే నిజ‌మ‌ని నాని నిర్ధారించారు. ఎల్లో మీడియాకు, ప్ర‌తిప‌క్షాల‌కు నాని చెప్పిన క‌థ రాజ‌కీయ అస్త్రంగా ఉప‌యోగ ప‌డుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉన్నా… వాన్ని మంత్రి నాని బ‌హిరంగంగా మ‌హిళా ఉద్యోగుల‌తో పంచుకోవ‌డం కాసింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. నాని నోరు జారార‌నే అభిప్రాయాలు ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.