అతిగా అడిగారు.. మితంగా ఒప్పుకున్నారు..

అనుకున్నట్టే అయింది.. ఛలో విజయవాడ రూపంలో భారీ ప్రదర్శనను నిర్వహించి.. రాజకీయ పార్టీలను తలపించే ప్రసంగాలతో ఉద్యోగ సంఘాల నాయకులు రెచ్చిపోయారు గానీ.. చివరికి మితమైన కోరికలకే ఒప్పుకున్నారు. ఫిట్మెంటు 23 శాతానికి మించి…

అనుకున్నట్టే అయింది.. ఛలో విజయవాడ రూపంలో భారీ ప్రదర్శనను నిర్వహించి.. రాజకీయ పార్టీలను తలపించే ప్రసంగాలతో ఉద్యోగ సంఘాల నాయకులు రెచ్చిపోయారు గానీ.. చివరికి మితమైన కోరికలకే ఒప్పుకున్నారు. ఫిట్మెంటు 23 శాతానికి మించి ఇచ్చే అవసరం లేకుండానే రాజీ చర్చలు కూడా ముగిసిపోయాయి. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ఒక కొలిక్కి వచ్చింది. సమ్మెను విరమించుకుంటున్నట్టుగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. అంతా సద్దు మణిగినట్టే. 

ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ను 30 నెలల పాటు ఇచ్చినప్పటికీ పీఆర్సీ ఖరారు చేసిన సమయంలో 23 శాతం ఫిట్మెంట్ నిర్ణయించారు. అయితే హెచ్ఆర్ఏ శ్లాబులను మార్చడం, ఇప్పటిదాకా 27గా ఇచ్చిన ఐఆర్ ఇచ్చినందను ఆ తేడా మొత్తాలను రికవరీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం చాలా పెద్ద వివాదానికి దారి తీసింది. 

తమ జీతాలనుంచి రికవరీ చేస్తారు అనే మాటను ఉద్యోగులు సహించలేకపోయారు. నిజానికి ఇలాంటి పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్న ఒకటి రెండు అంశాల విషయంలో వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేసి ఉంటే ఎప్పుడో సమస్య సమసిపోయి ఉండేది. 

కానీ ఉద్యోగ సంఘాల నాయకులు.. మొత్తం మూడు జీవోలను రద్దు చేయాల్సిందేనని.. అసలు ఆ మూడు జీవోలను రద్దు చేసేదాకా చర్చలకు కూడా వచ్చేది లేదని చాలా భీష్మించుకుని కూర్చున్నారు. ఆ సమయంలో గ్రేట్ ఆంధ్ర‌ కూడా ఓ కథనం అందించింది. 

మితంగా అడిగితే ప్రభుత్వం ఒప్పుకునే అవకాశాలు ఉన్నదని పేర్కొంటూ ‘అతి మాని మితంగా అడిగితే మేలు’ అనే శీర్షికతో ఓ కథనాన్ని అందించింది. హెచ్ఆర్ఏ తగ్గింపు, రికవరీలకు సంబంధించిన విషయాలకే పరిమితం అయితే ఉద్యోగుల సమస్య త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నదని ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. 

ఇప్పుడు అచ్చంగా అదే జరిగింది. ఆ విషయాలతో పాటు క్వాంటం పెన్షన్ లలో కొద్దిగా సానుకూల నిర్ణయాలతో మాత్రమే ప్రభుత్వం ఉద్యోగులకు మధ్య ఒప్పందం కుదిరింది. మూడు జీవోల రద్దు అనే అంశాన్ని అసలు ప్రభుత్వం పట్టించుకోనేలేదు. 27 శాతం తగ్గకుండా 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న డిమాండ్ ను కూడా పట్టించుకోలేదు. మొత్తానికి వ్యవహారం సమసిపోయింది. 

ఉద్యోగులు ఛలో విజయవాడ నిర్వహించారు. ప్రభుత్వం మీద అనుచితమైన రీతిలో పెద్ద పెద్ద రాజకీయ విమర్శలు చేశారు. చివరికి ఇప్పుడు సంఘాల నాయకులందరూ వరుసగా క్యూకట్టినట్టుగా ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నారు.