స‌జ్జ‌ల‌కు కోపం తెప్పించిన నేత‌లు

ఉద్యోగులు, ప్ర‌భుత్వం మ‌ధ్య చ‌ర్చ‌ల్లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క పాత్ర పోషించారు. త‌మ జీతాలు త‌గ్గ‌డానికి ప్ర‌ధాన కుట్ర‌దారుడిగా స‌జ్జ‌ల‌పై ఉద్యోగులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అందుకే చ‌ర్చ‌ల్లో స‌జ్జ‌ల పాల్గొన…

ఉద్యోగులు, ప్ర‌భుత్వం మ‌ధ్య చ‌ర్చ‌ల్లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క పాత్ర పోషించారు. త‌మ జీతాలు త‌గ్గ‌డానికి ప్ర‌ధాన కుట్ర‌దారుడిగా స‌జ్జ‌ల‌పై ఉద్యోగులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అందుకే చ‌ర్చ‌ల్లో స‌జ్జ‌ల పాల్గొన వ‌ద్ద‌ని, నేరుగా సీఎంతోనే మాట్లాడ్తామ‌ని ఉద్యోగులు ఆవేశంతో ఊగిపోతూ అన్నారు. అయితే ఉద్యోగుల‌కు ఎలాగైతే వారి ప్ర‌తినిధులుగా నాయ‌కులు ఉంటారో, ప్ర‌భుత్వానికి కూడా తాము అలాంటి వాళ్ల‌మే అని ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు.

చివ‌రికి ఉద్యోగుల‌తో నిర్వ‌హించిన చ‌ర్చ‌లు స‌త్ఫ‌లితాలు ఇచ్చాయి. ఇరువైపులా పంతాలు, ప‌ట్టింపులు త‌గ్గించుకోవ‌డంతో స‌మ‌స్య‌ల‌కు ఓ ప‌రిష్కార మార్గం దొరికింది. అయితే ఉద్యోగుల్లో చెప్పుకోత‌గ్గ స్థాయిలో గుర్తింపు లేని సంఘాల నేత‌లు చ‌ర్చ‌ల అనంత‌రం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఉద్దేశ పూర్వ‌కంగా ఇంకా ఉద్యోగుల‌ను రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని కొంద‌రు ప్ర‌తిప‌క్ష నేత‌లు, ఎల్లో మీడియా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు అధికార పార్టీ వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. అలాంటి ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్ర‌భుత్వంతో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌వంత‌మ‌య్యాయ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు, అలాగే ఉద్యోగుల డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని సానుకూల నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు మంత్రుల క‌మిటీ నేత‌లు ఉమ్మ‌డి మీడియా స‌మావేశంలో ప్ర‌క‌టించారు. అనంత‌రం కొంద‌రు ఉపాధ్యాయ సంఘాల నేత‌లు త‌మ‌కు చ‌ర్చ‌లు సంతృప్తి ఇవ్వ‌లేద‌ని, ఉద్య‌మానికే మొగ్గు చూపుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక, పెన్ష‌న‌ర్ల ఆందోళ‌న ఫ‌లితంగా ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి చ‌ర్చ‌లు జ‌రిపినా, డిమాండ్ల‌ను సాధించుకోవ డంలో విఫ‌ల‌మ‌య్యామ‌ని ఏపీటీఎఫ్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు భానుమూర్తి, పాండురంగ వ‌ర‌ప్ర‌సాదరావులు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. చ‌ర్చ‌ల్లో స‌ఫ‌ల‌మైంది ప్ర‌భుత్వ‌మే అని, తాము విఫ‌ల‌మయ్యామ‌ని తెలిపారు. ఇది చీక‌టి ఒప్పందం అని, తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు. త‌మ‌తో క‌లిసొచ్చే సంఘాల‌తో ఆందోళ‌న కొన‌సాగిస్తామ‌ని వారు ప్ర‌క‌టించారు.

అలాగే ఉద్యోగుల‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఫిట్‌మెంట్‌పై పున‌రాలోచ‌న లేద‌ని మంత్రుల క‌మిటీ చెప్ప‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నామ‌ని ఉపాధ్యాయ సంఘాల‌కు చెందిన పీఆర్సీ క‌మిటీ స‌భ్యులు సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు, జి.హృద‌య‌రాజు, ఒ.ప్ర‌సాద్ పేర్కొన్నారు. శ‌నివారం రాత్రి వారు మీడియాతో మాట్లాడుతూ మంత్రుల క‌మిటీ చ‌ర్చ‌ల్లో కొన్నింటిపై సానుకూలంగా స్పందించిన‌ప్ప‌టికీ, ఇచ్చిన ఐఆర్ కంటే త‌క్కువ ఇచ్చిన అంశంపై మాట్లాడితే దానికి నిరాక‌రించ‌డం, ముఖ్య‌మంత్రి వ‌ద్ద కూడా ప్ర‌స్తావించ‌కూడ‌ద‌ని తెల్ప‌డం అప్ర‌జాస్వామికం అన్నారు. ఫిట్మెంట్‌ను స‌వ‌రించ‌క‌పోవ‌డంతో పాటు ఇత‌ర అంశాల‌పై  స్ప‌ష్ట‌త లేద‌ని వారు తెలిపారు.

వీరి విమ‌ర్శ‌ల‌పై స‌జ్జ‌ల ఘాటుగా స్పందించారు. చ‌ర్చ‌ల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు అన్ని అంశాలు అంగీక‌రించాక బ‌య‌ట‌కు వెళ్లి వ్య‌తిరేకంగా మాట్లాడ్డం, ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. చివ‌రి నిమిషం వ‌ర‌కూ చ‌ర్చ‌ల్లో వుండి అన్నింటికీ ఒప్పుకుని మినిట్స్‌లో సంత‌కాలు కూడా పెట్టి స‌మ్మె విర‌మిస్తామ‌ని చెప్పార‌న్నారు. అంతా అయిపోయాక  సంత‌కాలు పెట్టి బ‌య‌ట‌కు వెళ్లిన కొంద‌రు ఉపాధ్యాయ సంఘ నేత‌లు చ‌ర్చ‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ్డం మంచి సంప్ర‌దాయం కాద‌న్నారు. బ‌య‌ట‌కు వెళ్లి వ్య‌తిరేకంగా మాట్లాడడాన్ని బట్టి ఏవో రాజ‌కీయ శ‌క్తులు వారిని బ‌య‌ట నుంచి న‌డిపిస్తున్న‌ట్టు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌న్నారు.

స‌జ్జ‌ల‌కే కాదు, ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు కూడా ఇవే అనుమా నాలున్న‌ట్టు స‌మాచారం. డిమాండ్ల ప‌రిష్కారంతో సంబంధం లేకుండా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక గ‌ళాల‌ను ప్రోత్స‌హించేందుకు ఇలాంటి నాయ‌కుల‌కు పెద్ద‌పీట వేస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. అయితే ఇలాంటి వాళ్ల కుట్ర‌ల‌ను తెలుసుకోలేని అమాయ‌క‌త్వం ఉద్యోగుల‌తో పాటు ప్ర‌భుత్వానికి లేద‌ని సంబంధిత నాయ‌కులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.