మైత్రీ మీద జనసేన ఫిర్యాదు వెనుక?

ఓ పార్టీ నాయకుడు తన పార్టీ అధినేతతో సంబంధం వున్న సంస్థ మీద అంత తేలిగ్గా ఫిర్యాదు చేస్తారా? ఆరోపణలకు దిగుతారా? దానికి రియాక్షన్ తన పార్టీ అధినేత నుంచి పాజిటివ్ గా వుండొచ్చు.…

ఓ పార్టీ నాయకుడు తన పార్టీ అధినేతతో సంబంధం వున్న సంస్థ మీద అంత తేలిగ్గా ఫిర్యాదు చేస్తారా? ఆరోపణలకు దిగుతారా? దానికి రియాక్షన్ తన పార్టీ అధినేత నుంచి పాజిటివ్ గా వుండొచ్చు. నెగిటివ్ గా వుండొచ్చు. అందువల్ల, ఓ మాట పార్టీ అధినేతకు చెప్పి చేయాలనుకుంటారు తప్ప మొండిగా రంగంలోకి దిగిపోరు కదా. ఈ లెక్కన పార్టీ నాయకుడు ఫిర్యాదు చేసే సంగతి పార్టీ నాయకుడికి తెలుసు అనుకోవాలా? తెలియదు అనుకోవాలా?

ఇదంతా మైత్రీ మూవీస్ సంస్థలో రాజకీయ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన బంధువు భాస్కర రెడ్డి ల మీద వైజాగ్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇన్ కమ్ టాక్స్ సంస్థ అధికారులకు చేసిన ఫిర్యాదు గురించే. బాలినేని, ఆయన బంధువుల పెట్టుబడులు సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో వున్నాయన్నది మూర్తి యాదవ్ ఆరోపణ. ఈ మేరకు దర్యాప్తు చేయాలని ఇన్ కమ్ టాక్స్ అధికారులను కోరారు.

మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు పెట్టారా? లేదా? అన్నది పక్కన పెడితే అలా పెట్టడం నేరమేమీ కాదు. డబ్బులు వున్నవాళ్లు ఎవరైనా మైత్రీ మూవీస్ కు అవసరం వుంటే, అంగీకారం వుంటే పెట్టుకోవచ్చు. తప్పేంటీ? కానీ అది కంపెనీ రికార్డుల్లో వుండాలి. తెరచాటు వ్యవహారం అయితే, పొలిటికల్ మనీ కనుక అభ్యంతరమే. కానీ నిజానికి సినిమా నిర్మాణాల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టడం చేస్తుంటారు. అయితే ఇది పెట్టుబడుల రూపంలో వుండదు. ఫైనాన్స్ రూపంలో వుంటుంది. రూపాయి నుంచి రెండు రూపాయల వడ్డీలకు ఇస్తారు.

సరే, అదంతా వేరే సంగతి. మైత్రీ మూవీస్ లో బాలినేని అండ్ కో పెట్టుబడుల మీద మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయబోతున్న సంగతి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు తెలుసా? తెలియదా? ఇదీ పాయింట్. ఎందుకంటే జనసేన కార్పొరేటర్ అనే హోదా మూర్తి యాదవ్ ది. అదే మైత్రీ మూవీస్ లో సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ సంగతి మూర్తి యాదవ్ తో సహా అందరికీ తెలిసిందే. అందువల్ల ఓ మాట పవన్ కళ్యాణ్ కు చెప్పే చేయాలనే అనుకుంటారు మూర్తి యాదవ్ ప్లేస్ లో వున్నవారు ఎవరైనా.

మరి అలా చెప్పారా? చెబితే పవన్ రియాక్షన్ ఏమిటి? అనుమతి ఇచ్చారా? ఇచ్చిన మేరకే ఫిర్యాదు చేసారా? ఇలా జవాబు తెలియాల్సిన ప్రశ్నలు అనేకం వున్నాయి. పవన్ కు తెలిసే జరిగి వుంటే, దాని వెనుక పవన్ ఉద్దేశం ఏమై వుంటుంది? లేదా పవన్ కు తెలియకుండా జరిగి వుంటే ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా వుంటుంది?

లేదా కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా జనసేన లో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం చాలా బలంగా వుందనుకోవాలా? మొత్తానికి ఏదో వుంది..అదేంటో తెలియాలి. అంతే.