ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధన్ నారసింహ క్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవ వేళ దర్శనానికి వచ్చిన శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి ఒక్కసారిగా ఆవేశానికి లోను అయ్యారు. తన జీవితంలో ఇంతటి దౌర్భాగ్యమైన ఏర్పాట్లు ఇప్పటిదాకా చూడలేదని అన్నారు.
భగవంతుడికి భక్తులకు మధ్య దూరం పెంచారని, దైవ దర్శనానికి వచ్చే భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్వామి మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ దేవాదాయ శాఖ తప్పే అని ఆయన అంటున్నారు. చందనోత్సవం వేళ స్వామిని దర్శించుకుందామని వచ్చే భక్తులను ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం భావ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.
భక్తులను ఇబ్బంది పెడుతున్న అధికారుల తీరుని చూసి తాను చందనోత్సవానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని ఆయన అన్నారు. అయితే దాను జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడంలేదని ఆయన అన్నారు. జగన్ పేదలకు న్యాయం చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు
దేవాదాయ శాఖ అధికారులే ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తోందని అన్నారు. అతి పెద్ద దైవ క్షేత్రానికి పూర్తి స్థాయి కార్యనిర్వాహక అధికారిని నియమించకపోవడం తప్పే అన్నారు. అధికారులు సక్రమంగా వ్యవహరించి ఉంటే పొరపాట్లు జరిగి ఉండవని ఆయన అంటున్నారు. స్వామి ఈ విధంగా ధర్మాగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
దౌర్భా గ్యంగా ఏర్పాట్లు ఉన్నాయని ఆయన ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే వైసీపీ ప్రభుత్వం చందనోత్సవ ఏర్పాట్లత్లో అట్టర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు. తెలుగుదేశం వారి విమర్శలకు తోడుగా స్వామి సైతం మండిపడడం విశేషం. వైసీపీకి మద్దతుగా ఉంటారనుకునే స్వామి తొలి సారి ఘాటుగా మాట్లాడడం తో వైసీపీలోనూ చర్చించుకుంటున్నారు. అయితే తాను జగన్ ప్రభుత్వాన్ని అనడంలేదని, అధికారుల తీరునే విమర్శిస్తున్నానని స్వామి వివరించారు. కానీ తెలుగుదేశం అనుకూల మీడియా స్వామి కామెంట్స్ ని హైలెట్ చేస్తోంది.
స్వామి అన్నారని కాదు కానీ చందనోత్సవం ఏర్పాట్లలో అధికారులు అతి చేశారని, సరైన నిర్ణయాలు కలసికట్టుగా తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. అధికారులు అంతా కొత్త వారు కావడం అనుభవం లేకపోవడంతో పాటు రెండు లక్షలకు పైగా వచ్చే భక్తుల విషయంలో అంచనాలు కూడా సరిగ్గా వేయకపోవడం వల్లనే ఎర్రటి ఎండలో కిలోమీటర్ల దూరంలో భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
వారంతా ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం అంటే వైసీపీ ప్రభుత్వానికే అప్రదిష్ట అని అంటున్నారు. చందనోత్సవం వంటి ప్రతిష్టాత్మకమైన ఘట్టంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయలేదని ఏర్పాట్లు చూస్తే అర్ధమైపోతున్నాయి. వృద్ధులు మహిళలు చిన్నారులు అంతా మండే ఎండలో కొండ వద్ద పడిన పాట్లు మాత్రం అధికారుల నిర్వాకాన్ని ఎత్తి చూపాయని చెప్పక తప్పదు.