విశాఖ జిల్లా నర్శీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్సెస్ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి మధ్య ప్రతీ రోజూ మాటల యుద్ధమే సాగుతుంది. రాజీనామాల దాకా వ్యవహారం పోతుంది. ఈ ఇద్దరి మధ్య సాగుతున్న డైలాగ్ వార్ లో మరోసారి రంగురాళ్ళ తవ్వకాలు బయటకు వస్తున్నాయి.
కోట్లాది రూపాయల విలువ చేసే రంగురాళ్ల అక్రమ వ్యాపారాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారు అని అయ్యన్నపాత్రుడు సీరియస్ గానే ఆరోపించారు. ఈ విషయంలో చాలా మంది ఉన్నారని ఆయన బండ వేశారు. నర్శీపట్నంలో రంగురాళ్ల అక్రమ సంపాదన వెనక లోకల్ ఎమ్మెల్యే హస్తం ఉందని అంటున్నారు.
తమ కుటుంబం కానీ తాము కానీ ఏ తప్పూ చేయలేదని, తమ హయాంలో తులసీవనంగా ఉన్న నర్శీపట్నాన్ని గంజాయివనంగా ప్రస్తుత ఎమ్మెల్యే మార్చేశారు అని అయ్యన్న ఆరోపించారు. దీనికి కౌంటర్ ఉంటుందిగా. సీన్ లోకి ఉమా శంకర్ గణేష్ వచ్చారు. అయ్యన్నపాత్రుడు ఊరకే ఆరోపణలు చేయడం కాదు, రంగురాళ్ళ వ్యాపారంలో ఒక్క రూపాయి అయినా తాను తీసుకున్నట్లుగా రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని పెను సవాల్ చేశారు.
అదే అయ్యన్నపాత్రుడు ఆయన కుటుంబం హస్తం ఉందని తాను అంటున్నానని అయ్యన్న ఏం చెబుతారని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు రాజకీయ జీవితం చాలించి ఇంట్లో కూర్చుంటారా అని నిలదీశారు. గత అయిదేళ్లలో మంత్రిగా అయ్యన్న పాత్రుడు రంగురాళ్ల అక్రమ వ్యాపారానికి మద్దతుగా నిలిచారని, వారి నుంచి వసూళ్ళు చేసిన రాజా అని విమర్శించారు.
అయ్యన్నపాత్రుడికి చెందిన వారే తాజాగా అక్రమంగా రంగురాళ్ళ తవ్వకాలలో దొరికారు అని గణేష్ ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు బురద జల్లుడికి పెట్టింది పేరని అన్నారు. వైసీపీ మీద విమర్శలు చేస్తే జనాలు నమ్ముతారని అయ్యన్న భ్రమలలో ఉన్నారని, ఆయన రొటీన్ రొడ్డకొట్టుడు విమర్శలకు కాలం చెల్లిందని, సత్తా ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.
మన్యం అంటేనే గంజాయి, రంగురాళ్ళు, గనులు ఇలా చాలా ఉంటాయి. అవి రాజకీయ దినుసులుగా మారిపోతున్నాయి. రాజీనామాలు కోరుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఇలాంటి సవాళ్ళు మరిన్ని జనాలు వినాల్సి ఉంటుందని అంటున్నారు.