టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి తాను రూ.25 తీసుకున్నట్టు ఈటల రాజేందర్ ఆరోపించారని, తీసుకోలేదని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు.
తనతో పాటు ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ఈటలకు రేవంత్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై నిరాధార ఆరోపణలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు.
రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడంపై ఈటల వ్యంగ్యంగా, ఘాటుగా తనదైన శైలిలో స్పందించారు. రూ.25 కోట్లు రేవంత్‌రెడ్డి తీసుకున్నారని ఎక్కడా పేరు ప్రస్తావించలేదని ఈటల అన్నారు. అయినా ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు, రేవంత్‌తో తనకు పోలికేంటని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్, తన రాజకీయ నేపథ్యాన్ని ఈటల వివరించి, మాటలతో టీపీసీసీ అధ్యక్షుడిని పొడిచారు.
'ఓటు నోటు కేసులో మీరు జైలుకెళ్లారు.. మీతో నాకు పోలికా? ప్రజల కోసం రేవంత్ ఎప్పుడూ జైలుకెళ్లలేదు. నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశా. రేవంత్ ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు ' అని ఈటల చురకలు అంటించారు. చివరి బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతా అని, ఈటల మాదిరిగా తాను లొంగిపోయిన వ్యక్తిని కాదని రేవంత్‌రెడ్డి తనపై ఆరోపణలు చేయడాన్ని బీజేపీ నేత సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే ఓటుకు నోటు కేసులో తాను జైలుకు వెళ్లలేదని రేవంత్‌ను ఈటల దెప్పి పొడిచారు.