తిరుపతి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు త్వరలో మహావకాశం కలగనుంది. తిరుపతి నగరంలో రెండు రోప్ వేలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. ఇది అయిన వెంటనే టెండర్లను పిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలిపారు.
తిరుపతి, తిరుమల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రాలు. తిరుపతి, తిరుమలలో ఉన్నట్టుగా మరెక్కడా హిందూ ఆలయాలు లేవు. ప్రతి హిందూ దైవానికి ఒక ఆలయం వుండడం ఇక్కడి ప్రత్యేకత.
తిరుపతి, తిరుమల ప్రాంతాలు నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగుతుంటాయి. తిరుపతిలో అడుగు పెడితే చాలు దైవ చింతనలోకి వెళతారు. తిరుపతి అందాలను ఆకాశం నుంచి వీక్షించాలనే కోరిక ప్రతి ఒక్కరిలో వుంటుంది. ప్రజలు, భక్తుల కోరిక మేరకు తిరుపతిలో రెండు రోప్ వేలను ఏర్పాటు చేసేందుకు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నిబద్ధతతో పని చేశారు. ఈ మేరకు అనుమతులు సాధించారు.
ఇటీవల తిరుపతి కార్పొరేషన్ నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో రెండు రోప్ వేలను ఏర్పాటు చేసేందుకు ఆమోదించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. శ్రీవారి భక్తులకు అనుకూలంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, అలాగే బస్టాండ్ నుంచి అలిపిరి వరకూ రెండు రోప్ వేలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. త్వరలో డీపీఆర్‌లు రెడీ అయ్యి, టెండర్లకు కూడా వెళ్లనున్నారు.
రోప్ వేలను ఏర్పాటు చేయడంతో తిరుపతి నగరాన్ని వీక్షించిన తృప్తి కలుగుతుంది. అలాగే నగరంలో భక్తుల రద్దీ తగ్గుతుంది.