ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతగానో ఇష్టపడే శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి కోపం వచ్చింది. సింహాచలం అప్పన్న చందనోత్సవానికి హాజరైన ఆయన భక్తుల ఇబ్బందులను చూసి ఆయన తీవ్రంగా చలించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటించారు. వైసీపీ స్వామిగా ముద్రపడిన శారదా పీఠాధిపతికి కోపం రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సింహాచలం అప్పన్న చందనోత్సవానికి హాజరైన ఆయన ఏర్పాట్లపై తీవ్రంగా మండిపడ్డారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనానికి ఎందుకొచ్చానా? అని ఆయన వ్యాఖ్యానించారు.
సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా ఆలయ అధికారులు వ్యవహరించారని ఆగ్రహించారు. పోలీసులను గుంపులుగా పెట్టారే తప్ప, క్రమ పద్ధతిలో లేరన్నారు. దీంతో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.
కొండ కింద నుంచిపై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు భక్తులు పడుతుంటే, వారి మధ్య దైవదర్శనం బాధ కలిగించిందన్నారు.
వైసీపీకి అనుకూల స్వామిగా ముద్రపడిన శారదా పీఠాధిపతి ఆగ్రహం చూసిన తర్వాతైనా భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం వుంది. లేదంటే ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధంగా వుంటాయి.