ఇంటికి ఆహ్వానించి పలకరించకపోతే ఎలా ఉంటుంది? అవార్డ్ ఇస్తామని పిలిచి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఇది కూడా అలాంటిదే. 'అమిత్ షాతో భేటీ.. రెడీ అయిపోండి' అంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్ కు సమాచారం. దీంతో అంతా సిద్ధమయ్యారు. ఏ దుస్తులు వేసుకోవాలి, ఏం మాట్లాడాలి లాంటివన్నీ ప్రిపేర్ అవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అయితే తమ షూటింగ్ షెడ్యూల్స్ కూడా మార్చుకున్నారు.
అంతలోనే తూచ్ భేటీ లేదన్నారు. ఇంకెప్పుడైనా చూద్దాం అన్నారు. ఆస్కార్ అవార్డ్ సాధించి, దేశఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ యూనిట్ కు దక్కిన గౌరవం ఇది. ఇంతోటి దానికి మీటింగ్ కు ముందు నడిపించిన ప్రహసనం సినిమాను తలపించింది.
ముందుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న కీరవాణి-చంద్రబోస్ తో అమిత్ షా మీటింగ్ అన్నారు. వాళ్లకు స్పెషల్ సన్మానం అన్నారు. అబ్బెబ్బే.. వాళ్లిద్దర్నే కలిస్తే ఏం బాగుంటుంది, మొత్తం కీలకమైన యూనిట్ సభ్యులందర్నీ కలిసి సన్మానం చేద్దామన్నారు. ఆ తర్వాత ఆ లిస్ట్ లోంచి కొందర్ని తొలిగించారు. అవార్డ్ గ్రహీతలతో పాటు హీరోలు, దర్శకుడితో భేటీ అన్నారు.
ఇలా 2 రోజులుగా మార్పుచేర్పులు చేసి, ఆఖరి నిమిషంలో ఆర్ఆర్ఆర్ యూనిట్ కు హ్యాండ్ ఇచ్చారు అమిత్ షా. దాని బదులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కలవకుండా ఉంటే సరిపోయేది. ఇలా ఊరించి, హ్యాండ్ ఇచ్చి అవమానించడం దేనికి?
యూనిట్ కు ఇలాంటి అవమానాలు కొత్త కాదు..
నిజానికి ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఇలాంటి అవమానాలు కొత్త కాదు. నాటు-నాటు పాటకు ఆస్కార్ రావడంతో దేశం యావత్తు సెలబ్రేట్ చేసుకుంది. దీంతో టీమ్ ను ఘనంగా సత్కరించాలని అంతా సూచించారు. అయితే 'తెలుగు చిత్ర పరిశ్రమ' పేరిట జరిగిన ఆ సత్కారం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ హీరోలెవ్వరూ హాజరుకాలేదు. దీనికితోడు అసలు ఆ కార్యక్రమం నిర్వహణలోనే 'ఆమ్యామ్యా వ్యవహారం' చాలా జరిగిందనేది ఇంటర్నల్ టాక్.
ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ యూనిట్ కు సన్మానం అన్నారు. కొంతమంది పార్లమెంట్ వేదికగా ప్రకటనలు కూడా గుప్పించారు. రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని కూడా కేంద్రం పట్టించుకోలేదు.
కనీసం వ్యక్తిగత స్థాయిలో అమిత్ షా లాంటి నేత కలిస్తే, ఆర్ఆర్ఆర్ యూనిట్ కు కొంచెం ఉత్సాహం-ప్రోత్సాహం వచ్చి ఉండేది. ఇప్పుడు ఆ ముచ్చట కూడా లేకుండా పోయింది. ఆస్కార్ ప్రతిమ పట్టుకొని చంద్రబోస్, కొంతమంది ప్రముఖుల చుట్టూ తిరగడం.. కీరవాణి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతోనే ఆ ముచ్చట తీరిపోయింది. ఆ ఆస్కార్ ప్రతిమలతో పాటు.. చరిత్రలో మిగిలిన గుర్తులేమైనా ఉన్నాయంటే అవి సెలబ్రిటీలు వేసిన ట్వీట్లు మాత్రమే.