రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల నుంచి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించినందుకు జగన్ సర్కార్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ ప్రైవేట్ పాఠశాలలకు కావడం విశేషం. రాయలసీమ తూర్పు, పశ్చిమ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల నుంచి చంద్రశేఖరరెడ్డి, రామచంద్రారెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో ప్రైవేట్ విద్యాసంస్థలు క్రియాశీలక పాత్ర పోషించాయి. ఈ దఫా ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఓటు హక్కు కల్పించింది. దీంతో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించడానికి కలిసొచ్చింది.
పలు కారణాల రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమపై ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోందనే ఆవేదన ఉపాధ్యాయుల్లో ఉంది. దీంతో తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం, వారికి చెక్ పెట్టేందుకు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను దగ్గరికి తీసుకుంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ఎత్తుగడ పని చేసింది. రెండు చోట్ల తమ నాయకుల్ని గెలిపించుకుంది.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు అనుమతిని 3 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వైఎస్సార్ పదేళ్ల వరకూ అనుమతి ఇచ్చారు. జగన్ వచ్చిన తర్వాత మూడేళ్లకు తగ్గించారు. మూడేళ్లకోసారి గుర్తింపు అనుమతి కోసం లక్షలాది రూపాయలు అధికారులకు లంచంగా ఇచ్చుకోలేమని, పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలనే డిమాండ్ ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేట్ పాఠశాలలు కీలక పాత్ర పోషించడంతో వాటి యజమానుల విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేట్ పాఠశాలల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.