ఎన్నిక‌ల్లో మీరెంత ఖ‌ర్చు పెట్టుకోగ‌ల‌రు?

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ ఎన్నిక‌లు టీడీపీ పాలిట చావుబ‌తుకుల స‌మ‌స్య‌గా చెప్పొచ్చు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌గా దృష్టి…

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ ఎన్నిక‌లు టీడీపీ పాలిట చావుబ‌తుకుల స‌మ‌స్య‌గా చెప్పొచ్చు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌గా దృష్టి సారించారు. పాద‌యాత్ర‌లో భాగంగా కొంత మంది అభ్య‌ర్థుల‌ను నారా లోకేశ్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుండ‌గా అభ్య‌ర్థుల గుణ‌గణాలతో పాటు ఆర్థిక వ‌న‌రుల‌పై చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు.

టికెట్ కోసం లోకేశ్ ద్వారా చంద్ర‌బాబుపై కొంద‌రు నేత‌లు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ దఫా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మొహ మాటానికి వెళ్లి, బ‌ల‌హీన అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చారు. రాయ‌ల‌సీమ‌కు చెందిన ఒక మ‌హిళా మాజీ మంత్రి త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌ని తెలుసుకుని, భారీ మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు పెడ‌తాన‌ని లోకేశ్‌తో మొర పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆల్రెడీ సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న నేత‌లు, కుటుంబాల్లో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు, లోకేశ్‌… అలాంటి వారికి చెక్ పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

దీంతో కాస్త కొత్త ముఖాలు, అలాగే ఆర్థిక వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్న నేత‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. అలాగే వివిధ స‌ర్వే నివేదిక‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న చంద్ర‌బాబు, వ్య‌తిరేక‌త ఉన్న నేత‌ల్ని ప‌క్క‌న పెట్టే క్ర‌మంలో ఆర్థిక వ‌న‌రులు లేవ‌నే సాకుతో చెక్ పెట్టే అవ‌కాశాలున్నాయి. ఇలా అనేక స‌మీక‌ర‌ణ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అభ్య‌ర్థుల వ‌డ‌పోత చేప‌ట్టారు. బాగా డ‌బ్బున్న నేత‌ల‌కు వీలైన‌న్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌ర్చు బాధ్య‌త‌ల్ని కూడా పెడుతున్న‌ట్టు స‌మాచారం.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌కు మంచి పేరు ఉన్న‌ప్ప‌టికీ, ఆర్థిక వ‌న‌రుల విష‌యానికి వ‌చ్చే స‌రికి, పార్టీనే భ‌రించాల్సి వ‌స్తోంది. అలాంటి చోట టికెట్ ఆశిస్తున్న ధ‌న‌వంతుల‌కు ఖ‌ర్చు బాధ్య‌త‌ల్ని పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ద‌ఫా వైసీపీ ఎంతైనా ఖ‌ర్చు పెట్ట‌డానికి వెనుకాడద‌ని, అధికార పార్టీని త‌ట్టుకోవాలంటే ఆర్థిక వ‌న‌రులే కీల‌క‌మ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. 

మ‌రోవైపు చంద్ర‌బాబుకు ఆర్థికంగా అండ‌గా నిలిచే వారిపై కేంద్ర ప్ర‌భుత్వం నిఘా పెట్టింద‌నే వాద‌న లేక‌పోలేదు. ఎన్నిక‌ల నాటికి ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. మొత్తానికి ఈ సారి ఎన్నిక‌ల్లో గ‌తం కంటే డ‌బ్బు విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.