సినిమా ఫ్లాప్ అయితే మహేష్ ఏం చేస్తాడు?

ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఏం చేస్తారు. దీనికి హీరోలు చాలా డెలికేట్ గా సమాధానం చెబుతుంటారు. జయాపజయాలు సహజం అంటారు. మరో ప్రాజెక్టుపై దృష్టి పెడతాం అంటారు. మహేష్ మాత్రం ఇలాంటి సినిమా…

ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఏం చేస్తారు. దీనికి హీరోలు చాలా డెలికేట్ గా సమాధానం చెబుతుంటారు. జయాపజయాలు సహజం అంటారు. మరో ప్రాజెక్టుపై దృష్టి పెడతాం అంటారు. మహేష్ మాత్రం ఇలాంటి సినిమా డైలాగులు చెప్పడం లేదు. తను నటించిన ఓ సినిమా ఫ్లాప్ అయితే చాలా బాధపడతానంటున్నాడు మహేష్ బాబు. సినిమా ఆడకపోతే తప్పంతా తనదే అంటున్నాడు.

“సినిమా ఫ్లాప్ అనేది నాకు చాలా బాధ కలిగించే విషయం. సినిమా ఆడకపోతే అందరికంటే ముందు నేనే బాధపడతాను. ఫ్లాప్ కు నేనే బాధ్యుడ్ని అని ఫీల్ అవుతాను. నా వల్లనే కదా డబ్బులు పోయాయి, కథ నేను ఓకే చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు కదా అని ఫీల్ అవుతాను. కాబట్టి ఫ్లాప్ కు మొట్టమొదటి బాధ్యుడ్ని నేనే. అందుకే సినిమా ఆడకపోతే 2-3 రోజులు రూమ్ నుంచి బయటకు రాను. నా ఫ్లాప్ ను బయటవాళ్లపై పెట్టను. ఫ్లాప్ నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తూ 2-3 రోజులు గడిపేస్తాను.”

ఇలా సినిమా ఫ్లాప్ తనను చాలా బాధిస్తుందనే విషయాన్ని బయటపెట్టాడు మహేష్. అయితే అలాంటి ఫెయిల్యూర్స్ నుంచే తను సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఇక కథల విషయానికొస్తే.. ప్రతి నిర్ణయం తనదేనని, కనీసం తన తండ్రి ప్రమేయం కూడా ఉండదని ప్రకటించాడు.

“బయట వాళ్ల మీద నేను ఎప్పుడూ ఆధారపడ లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రతి నిర్ణయం నాదే. నా కథల్ని నాన్నతో కూడా ఎప్పుడూ చర్చించలేదు. నేనే నిర్ణయాలు తీసుకున్నాను. తప్పులు నావే, ఒప్పులు కూడా నావే. నా అబ్బాయి కూడా ఫ్యూచర్ లో అలానే ఉండాలి. నేను వాడ్ని సపోర్ట్ చేయను.”

కెరీర్ లో ఫెయిల్యూర్స్ ను గుర్తించినవాడే సక్సెస్ అవుతాడని, తన కెరీర్ లో అదే జరిగిందని అంటున్నాడు మహేష్. తాజాగా ఈ హీరో త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా లాంఛ్ చేశాడు. ఏప్రిల్ నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.