ఏపీ అసెంబ్లీకి వారు వెళ్లి సాధిస్తున్నది ఏమీ లేదు. నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతి సందర్భంలో ఏదో ఒక సాకుతో ఎగ్గొట్టడానికే వారు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఎమ్మెల్యేల సంఖ్య అనేది ఆ పార్టీ బలంగా మనకు కనిస్తుంది. ఆ కోణంలో చూసిన్పపుడు.. తెలుగుదేశం పార్టీకి శాసనసభలో మరో ఎమ్మెల్యే బలం తగ్గే ప్రమాదం ఉన్నదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తొందర్లోనే హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం ఖాళీ అవుతుందా అనే అభిప్రాయం వినిపిస్తోంది.
హిందూపురం నుంచి ప్రస్తుతం సినీనటుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాదులో నివాసం ఉంటూ, సినిమా ఇతర వ్యాపకాలలో నిత్యం బిజీగా ఉండే బాలయ్యకు నియోజకవర్గం మీద దృష్టి కేంద్రీకరించడానికి దక్కే సమయమే తక్కువ. కాకపోతే.. తన మీద విమర్శలు రాకుండా ఉండేందుకు స్థానికంగా ఒక ఇల్లు కూడా ఆయన తీసుకున్నారు. అంతకు మించి.. ఆయన విజిటింగ్ ఎమ్మెల్యేగానే హిందూపురానికిక ఉన్నారు తప్ప లోకల్ ఎమ్మెల్యేగా పనిచేయడం లేదు. అలాంటి బాలకృష్ణ ఇప్పుడు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు. ఆయనకు అంత విరక్తి ఎందుకొచ్చినట్టు?
ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల జిల్లాల ఏర్పాటుకు సంబంధించి.. కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల ఏర్పాటులో కొన్ని సవరణలు కూడా చేసింది. అయితే అనంతపురం జిల్లాలో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి.. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ జిల్లాకు సత్యసాయి పేరు విషయంలో అభ్యంతరం లేదు గానీ.. జిల్లా కేంద్రగా హిందూపురం ఉండాలంటూ డిమాండ్ వినిపిస్తోంది.
ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఈ డిమాండ్ తో ఉద్యమం చేస్తున్నారు. ఆయన హిందూపురంలో పాల్గొన్న కార్యక్రమంలో.. హిందూపురం జిల్లాకేంద్రం చేయకపోతే గనుక.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాను రాజీనామా చేస్తానంటే ప్రభుత్వం భయపడుతుందని బాలయ్య ఎలా అనుకున్నారో గానీ.. మొత్తానికి ఇప్పుడు ఆయన రాజీనామా గురించి చర్చ జరుగుతోంది.
సత్యసాయి జిల్లా విషయంలో మార్పుచేర్పులకు ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేదని.. అలా వారు దృఢంగా ఉంటే గనుక.. ఇక బాలయ్య తాను మాట నిలకడ ఉండే మనిషిని అని నిరూపించుకోవాలంటే.. రాజీనామా చేయాల్సి వస్తుందేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చచ్చీచెడీ 23 స్థానాల్లోమాత్రం గెలిచింది. ఆ పార్టీనుంచి ఇప్పటికే ముగ్గురికంటె ఎక్కువగా జారిపోయారు. ఇలా ఎందుకు అనవలసి వస్తున్నదంటే.. వైసీపీతో చెట్టపట్టాలు వేసుకుని తిరగకపోయినప్పటికీ తెలుగుదేశానికి దూరంగా మెలగుతున్నవారు అనేకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలో మీ బలం ఎంత అని అడిగితే.. ఆ పార్టీ వారు కూడా వెంటనే జవాబు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఉండగా.. బాలకృష్ణ కూడా రాజీనామా చేస్తే ఇంకో స్థానాన్ని పార్టీ కోల్పోవాల్సిందే.
ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రూపంలో ఉప ఎన్నికల వచ్చినా వైసీపీ తప్ప మరో పార్టీ గెలిచే అవకాశం లేదని పలువురి అంచనా. అలాంటప్పుడు బాలయ్య రాజీనామా చేస్తే.. టీడీపీ సిటింగ్ సీటును కోల్పోవాల్సి వస్తుందని పలువురు జోకులు వేసుకుంటున్నారు. బాలయ్య ఏదో సభలో జనాన్ని రంజింప జేయడానికి రాజీనామా డైలాగు వేసి ఉంటారు గానీ.. నిజంగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం ఉండకపోవచ్చునని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.