చర్చలు ఫలిస్తే.. ఇద్దరూ నెగ్గినట్టే!

‘సామరస్య సంబంధాలను కోరుకునే చోట- యుద్ధం ముగిసిన తర్వాత ఎన్నడూ కూడా ఒక్కరి విజయంగా చూడనే కూడదు. గెలిచామనే అహంకారం కాదు.. ఇరువురి సత్సంబంధాలు ముఖ్యం అనుకునేప్పుడు.. ఎవరు నెగ్గినా- ఎవరు తగ్గినా.. ఆ…

‘సామరస్య సంబంధాలను కోరుకునే చోట- యుద్ధం ముగిసిన తర్వాత ఎన్నడూ కూడా ఒక్కరి విజయంగా చూడనే కూడదు. గెలిచామనే అహంకారం కాదు.. ఇరువురి సత్సంబంధాలు ముఖ్యం అనుకునేప్పుడు.. ఎవరు నెగ్గినా- ఎవరు తగ్గినా.. ఆ ఫలితాన్ని ఇద్దరి విజయంగానే పరిగణించాలి.’’ ఈ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోండి. శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు, శనివారం కూడా కొనసాగనున్న నేపథ్యంలో సాయంత్రానికి ఏకాభిప్రాయం కుదరితే అప్పుడు ఈ సిద్ధాంతాన్ని వర్తించుకోవాలి. 

ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్న వాతావరణాన్ని, పరిస్థితిని గమనిస్తే ఇద్దరూ కూడా చెరొక మెట్టు దిగినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం మెట్టు దిగిన విషయం స్పష్టమైపోయింది. అయితే ఉద్యోగులు మెత్తబడ్డ వైఖరే కనిపిస్తోంది ఇంకా పూర్తిగా మెట్టు దిగకపోవడం వలన చర్చలు శనివారానికి కూడా వాయిదా పడ్డాయి. 

మితమైన డిమాండ్లతో ఉద్యమం చేస్తే సానుకూల ఫలితం తప్పకుండా లభిస్తుందని, అతి డిమాండ్లకు వెళ్లినంత కాలం పరిస్థితి పీటముడి పడుతుందని గ్రేటాంధ్ర డాట్ కామ్ ముందే ఒక ప్రత్యేక కథనాన్ని అందించింది. ఇప్పుడు చర్చల పురోగతి అలాగే కనిపిస్తోంది. ఉద్యోగుల డిమాండ్లలో ఐఆర్ రూపంలో అదనంగా ఇచ్చిన సొమ్ములను రికవరీ చేయకూడదని, హెచ్ఆర్ఏ శ్లాబులు పెరగాలనే సహేతుక డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. 

ఇప్పుడు ప్రభుత్వం ఆ రెండు డిమాండ్ల విషయంలో సానుకూలత తేల్చేసింది. రికవరీ అనేది ఉండదని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులకు స్పష్టం చేసింది. అలాగే హెచ్ ఆర్ఏ శ్లాబులు మార్చేందుకు కూడా కమిటీ అంగీకరించింది. సిటీ కాంపన్సేటరీ అలవెన్సు విషయంలో ఇంకా ఇదమిత్థంగా తేలలేదు. ఆలోచిస్తాం అని మాత్రమే ప్రస్తుతానికి హామీ ఉంది. 

అయితే ఉద్యోగులు మాత్రం ఇంకా చాలా విషయాలు తేల్చవలసి ఉంది. ఫిట్మెంటు అనేది ఐఆర్ ఇచ్చిన 27 శాతానికి తగ్గకూడదని, 30 శాతం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్వాంటం పింఛను విషయంలో డిమాండ్లున్నాయి. అలాగే సీపీఎస్ రద్దు గురించి వారు చేస్తున్న డిమాండ్ కూడా కీలకమైనది. ఇవన్నీ తేలలేదు. శనివారం కూడా మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మధ్య చర్చలు జరుగుతాయి. అన్నీ ఒక కొలిక్కి వస్తే మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కూడా నేతలు కలిసే అవకాశం ఉంది. 

అయితే చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టేనని, ప్రభుత్వం మెట్లు దిగినది తేలిపోయింది గానీ.. ఉద్యోగులు కూడా మెట్లు దిగారనే సంగతి వారు ఒప్పుకోవడం అనే లాంఛనం మాత్రమే మిగిలి ఉన్నదని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉభయుల మధ్య పట్టు విడుపు తోనే వివాదం సమసి తిరిగి సామరస్య వాతావరణం నెలకొంటుంది.