ప్లీజ్..అర్ధం చేసుకోరూ..

అవును. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇపుడు రాష్ట్ర మంత్రులు చెబుతున్న మాట ఇది. ఒక విధంగా మంత్రులు ఎక్కడకు వెళ్లినా ఇదే సమస్యను టచ్ చేస్తూ ఆందోళనలు సమ్మెలు వద్దు, చర్చలకు రండి అని ఉద్యోగ…

అవును. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇపుడు రాష్ట్ర మంత్రులు చెబుతున్న మాట ఇది. ఒక విధంగా మంత్రులు ఎక్కడకు వెళ్లినా ఇదే సమస్యను టచ్ చేస్తూ ఆందోళనలు సమ్మెలు వద్దు, చర్చలకు రండి అని ఉద్యోగ యూనియన్ల నేతలను పిలుస్తున్నారు.

కొత్త పీయార్సీ మీద మీకు ఏమైనా ఒకటి రెండు అంశాల్లో ఇబ్బందులు ఉంటే వాటి మీద వాటి మీద చర్చిద్దామని, పట్టు విడుపులతో ఉద్యోగులు ఉండాలని మంత్రి సీదరి అప్పలరాజు అంటున్నారు. ఈ ప్రభుత్వం మీది, మీ మంచి కోసం ఎంతో చేసింది. జగన్ సర్కార్ లో ఏ ఉద్యోగికీ తక్కువ జీతం ఉండరాదని భావించామని అన్నారు.

అందుకోసమే 27 శాతం ఐఅర్ ఇవ్వడం ద్వారా గత రెండేళ్లలో 18 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అత్యంత సానుకూలంగా ఉన్న సర్కార్ తమదని మంత్రి చెప్పారు.

గత ప్రభుత్వాలు టచ్ చేయని అనేక రంగాలకు చెందిన ఉద్యోగులకు జీతాలు పెంచిన ఘనత జగన్ దే అని ఆయన గుర్తుచేశారు. యానిమేటర్స్ నుంచి అంగన్ వాడీల నుంచి మొదలుపెడితే శానిటరీ వర్కర్స్ దాకా అందరికీ జీతాలు పెంచిన సర్కార్ తమదని ఆయన పేర్కొన్నారు.

ఒక విధంగా కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం దారుణంగా తగ్గినా కూడా రెస్పెక్టబుల్ ఫిట్మెంట్ ని ఇచ్చి ప్రభుత్వం సాహసమే చేసింది అని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీ 20 శాతం ఫిట్మెంటేనని ఆయన ఈ సందర్భంగా అప్పలరాజు  చెప్పడం విశేషం.

అటువంటి వేళ అన్ని విషయాలూ ఆలోచించుకుని ఉద్యోగులు సమ్మె బాటను వీడి చర్చలకు రావాలని ఆయన కోరుతున్నారు. సరే మంత్రి గారు చెప్పినది బహు బాగున్నా తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం అసలు విషయాలను టచ్ చేయడంలేదని ఉద్యోగులు అంటున్నారు.

మనమంతా ఒక్కటే ప్రభుత్వంలో మీరూ భాగమే అని మంత్రి అంటూంటే మా మీద ప్రభుత్వ పెద్దలు రాజకీయ విమర్శలు చేయిస్తున్నారని సర్కార్ మీద ఉద్యోగ సంఘాల నేతలు గుర్రుమంటున్నారు. మొత్తానికి సమ్మె అనివార్యమైన ప్రస్తుత పరిస్థితులలో ఇపుడు ఉద్యోగులకు ఏమేమి చేశామన్నది మంత్రులు చెబుతూంటే ఉద్యోగులు మాత్రం మాకు తీరని అన్యాయం జరిగింది అంటున్నారు.  

కేవలం నలభై ఎనిమిది గంటలలో సమ్మె సైరన్ ఏపీలో మోగనుంది అన్నది ఇప్పటికైతే కన్ ఫర్మ్ అని ఉద్యోగ సంఘాల నేతలు తేగేసి చెబుతున్నారు.