ఇన్నాళ్లకు తనకు సూటయ్యే దీక్ష చేసిన బాలయ్య

బాలకృష్ణ, లోకేష్ నోరు తెరిచి మాట్లాడటం కంటే, సైలెంట్ గా ఉండటమే వారికి, పార్టీకి, కార్యకర్తలకు మేలు. ఆ విషయం చాలా సార్లు రుజువైంది కూడా. అన్ స్టాపబుల్ కార్యక్రమంలో చెవిలో బ్లూటూత్ తో…

బాలకృష్ణ, లోకేష్ నోరు తెరిచి మాట్లాడటం కంటే, సైలెంట్ గా ఉండటమే వారికి, పార్టీకి, కార్యకర్తలకు మేలు. ఆ విషయం చాలా సార్లు రుజువైంది కూడా. అన్ స్టాపబుల్ కార్యక్రమంలో చెవిలో బ్లూటూత్ తో అనర్గళంగా మాట్లాడే బాలకృష్ణ.. బయటకొస్తే మాత్రం బుల్ బుల్ బాలయ్యలాగా మారిపోతారు. 

ప్రేమ ఎక్కువైతే అభిమానులకు చెంప దెబ్బలు, చేతి దెబ్బలు కామన్. ఫ్యాన్స్ కు ఆ అతి ప్రేమ, ఆప్యాయతలు అలవాటైపోయాయి కూడా. కానీ ఇన్నాళ్లకు బాలకృష్ణ తనకు సరిపోయే దీక్ష చేశారు. అదే మౌన దీక్ష. అవును, బాలయ్య మౌనంగా దీక్ష చేసి చివర్లో రాజీనామాస్త్రం విసురుతానంటూ రెచ్చిపోయారు.

బాలయ్య – మౌనదీక్ష.. ఈ రెండూ సెట్ కావు..

నోటికి వచ్చింది, అప్పటికప్పుడు తను అనుకున్నది తడబడుతూ దబిడ దిబిడ డైలాగుల రూపంలో బయటపెట్టడం బాలకృష్ణకు అలవాటు. ఒకరకంగా బాలయ్య హిందూపురం జిల్లా కోసం నిరసన దీక్ష చేపట్టి బహిరంగ సభలో భారీ డైలాగులు కొడితే అది కాస్త నవ్వులపాలయ్యేదేమో. 

కానీ ఆయన మౌన దీక్ష పేరుతో రెండు గంటలసేపు మౌనంగా ఉండటంలో సక్సెస్ అయ్యారు. అసలు బాలకృష్ణ మౌన దీక్ష ఎలా చేస్తారంటూ చాలామంది ఆశ్చర్యంగా, ఆతృతగా చూశారు. ఆ ఆతృతే ఆ కార్యక్రమానికి హైలెట్ అయింది. బాలయ్య కార్యక్రమానికి కవరేజ్ పెంచింది.  

సవాళ్లతో ఏం సాధిస్తారు..?

రెండు గంటల దీక్ష తర్వాత ఇక బాలకృష్ణ చేసిన సవాళ్లు మౌన దీక్ష అర్థాన్నే మార్చేశాయంటే అతిశయోక్తి కాదు. అవును, మౌన దీక్ష అంటే, మౌనంగా తన పోరాటం సాగుతుందని, ఎవరినీ ఎక్కడా విమర్శించబోమని, మౌనంగానే వారిపై ఒత్తిడి తెచ్చి తాము అనుకున్నది సాధిస్తామని చెప్పే ప్రయత్నం. 

సత్యాగ్రహ దీక్ష చేసి టెంట్ ఖాళీ చేసే టైమ్ లో గొడవపడి తలలు పగలగొట్టుకుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో.. మౌన దీక్ష తర్వాత సవాళ్లు విసరడం కూడా అంతే కామెడీగా ఉంటుంది. మౌన దీక్షతో కాస్త అటెన్షన్ క్రియేట్ చేసిన బాలకృష్ణ చివర్లో రాజీనామా సవాళ్లు విసిరి కామెడీ చేశారు. 

ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టడాన్ని సంతోషించలేదు కానీ, అన్న క్యాంటీన్లు ఎందుకు తీసేశారంటూ రాజకీయ రచ్చ రాజేశారు. జగన్ ని తిట్టే క్రమంలో వైఎస్ఆర్ ని పొగిడి అందరికీ షాకిచ్చారు. ఇలా మౌన దీక్ష పేరుతో బాలకృష్ణ కొత్త ఎపిసోడ్ చూపించారు. అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ పూర్తైంది కదా, ఇక కొన్నాళ్లు ఆయన రాజకీయాలతో సేదతీరతారేమో చూడాలి.