అది కోపం కాదు.. ఎన్నికల వ్యూహం

గడిచిన ఏడాది కాలంగా బీజేపీపై విరుచుకుపడుతున్నారు కేసీఆర్. ఈమధ్య కాలంలో అది ఇంకాస్త ఎక్కువైంది. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా గవర్నర్ ను పక్కనపెట్టారు. బడ్జెట్ సందర్భంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. పనిలోపనిగా థర్డ్ ఫ్రంట్ పనుల్ని…

గడిచిన ఏడాది కాలంగా బీజేపీపై విరుచుకుపడుతున్నారు కేసీఆర్. ఈమధ్య కాలంలో అది ఇంకాస్త ఎక్కువైంది. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా గవర్నర్ ను పక్కనపెట్టారు. బడ్జెట్ సందర్భంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. పనిలోపనిగా థర్డ్ ఫ్రంట్ పనుల్ని మొదలుపెట్టారు. మరోవైపు తన మంత్రివర్గంతో కామెంట్స్ చేయిస్తున్నారు. 

తన మీడియాతో మోదీ పరువు బజారుకీడుస్తున్నారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ మొదలవుతోందని, దానికి కేసీఆరే నాయకత్వం వహిస్తున్నారంటూ వరుస కథనాలు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇదంతా కేసీఆర్ ఎందుకు చేస్తున్నారు.. నిజంగా కేంద్రంపై ఆయనకు అంత కోపం ఉందా..?

విశ్లేషకులు చెబుతున్న మాట మాత్రం మరో విధంగా ఉంది. దీన్ని ఎన్నికల వ్యూహంగా వాళ్లు చూస్తున్నారు. కేంద్రాన్ని రెచ్చగొట్టి, వాళ్లతో తిట్లు తిని, ఆ విధంగా తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి ఈసారి ఎన్నికలకు వెళ్లాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. 

పశ్చిమ బెంగాల్ లో ఈమధ్య అదే జరిగింది. “కేంద్రం Vs బెంగాల్” అన్నట్టుగా పరిస్థితిని మార్చేశారు మమతా బెనర్జీ. అనుకున్నది సాధించారు. ఇప్పుడు అదే ఫార్ములాని తెలంగాణలో అప్లయ్ చేయాలనుకుంటున్నారు కేసీఆర్. ముందస్తుకు వెళ్లకుండా, ఇలా కేంద్రంపై విరుచుకుపడే కార్యక్రమం కోసం ఈ ఏడాది సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నారు.

నిజానికి తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా లేదు. అందుకే కేసీఆర్, బీజేపీని ఎంచుకున్నారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేసేకంటే, బీజేపీని టార్గెట్ చేయడం ఈజీ. అలా బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ మంత్రాంగం ఫలిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు.

ఈటల ఎపిసోడ్ తర్వాత మరింత ఆగ్రహం..

బీజేపీలో చేరిన ఈటల హుజూరాబాద్ నుంచి గెలిచి.. కేసీఆర్ పై ఆధిపత్యం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ లో మరింత కసి పెరిగింది. పనిలో పనిగా హస్తిన పీఠంపై ఆశ కూడా పెరిగింది. కేటీఆర్ కి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టే లోగా, తాను ఢిల్లీలో సెటిలవ్వాలనుకుంటున్నారు కేసీఆర్. అందుకే తెలంగాణ జాతి రాజకీయాల్ని పక్కనపెట్టి, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.

కేసీఆర్ కి ఇది రెండు విధాలుగా లాభం చేకూర్చే అంశం. ఓవైపు కాంగ్రెస్ ని కాదని, బలహీనమైన బీజేపీని ప్రత్యర్థిగా చేసుకుని తెలంగాణలో చక్రం తిప్పడం. మరోవైపు కేంద్ర రాజకీయాల్లో కీలకం కావడం. కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగానే కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలొస్తే మాత్రం కేసీఆర్ వ్యూహం మారే అవకాశముంది.