ఫ్యాన్స్..ఎక్కడికి వెళ్తున్నారు!

ఓ హీరో ఫ్యాన్ మరో హీరో ఫ్యాన్ ను చంపేసాడు..అది కూడా ఓ వాట్సాప్ స్టేటస్ కు సంబంధించి వివాదం చెలరేగడంతో. Advertisement ఇది వెస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన. ఈస్ట్, వెస్ట్ గోదావరి…

ఓ హీరో ఫ్యాన్ మరో హీరో ఫ్యాన్ ను చంపేసాడు..అది కూడా ఓ వాట్సాప్ స్టేటస్ కు సంబంధించి వివాదం చెలరేగడంతో.

ఇది వెస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలో ఫ్యాన్స్ వార్ కాస్త ఎక్కువే వుంటుంది. కానీ ఇది థియేటర్ల డెకరేషన్ కు, రికార్డులు చెప్పుకోవడం వరకు, విడుదల టైమ్ లో భారీ హడావుడి వరకు పరిమితం అనుకుంటే, ఇప్పుడు ఆవేశ హత్యల వరకు వెళ్లింది. ఆవేశంలో హత్యలు అన్నది రీజన్ ఏదైనా తరచు వినిపించే వార్తనే.

ఫ్యాన్స్ ఆవేశపడడం అన్నది, అది హత్యకు దారి తీయడం అన్నది ఈ సోషల్ మీడియా కాలంలోనే కాదు, జమానా కాలంలో కూడా జరిగింది. దాదాపు 45 ఏళ్ల కిందట విశాఖ జిల్లాలో ఎన్టీఆర్-కృష్ణ ఫ్యాన్స్ నడుమ వివాదం చెలరేగి ఇలాగే జరిగింది. హత్యలకు పాల్పడింది మైనారిటీ తీరని కుర్రాడు. అప్పట్లో సాయం వేళల్లో థియేటర్లే ఫ్యాన్స్ రచ్చకు వేదికలుగా వుండేవి. థియేటర్ర దగ్గర కూర్చుని ఎన్ని టికెట్ లు తెగుతున్నాయి, అవసరం అయితే ఫ్యాన్స్ అంతా తలా రూపాయి వేసుకుని టికెట్ లు భర్తీ చేసి రికార్డులు పదిలంగా వుండేలా చూసుకోవడం అన్నది కామన్ గా వుండేది. అంతకు మించి గొడవలు అన్నది ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఎప్పుడో పుష్కారానికి ఒక సారి జరిగేవి.

కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత, ముఖ్యంగా ట్విట్టర్ అనేది అరచేతిలోకి అందుబాటులోకి వచ్చాక, ఫ్యాన్స్ వ్యవహారం నానా రచ్చగా మారింది. అసలు నిజంగా ఫ్యాన్స్ నేనా అన్నది కూడా అనుమానం. హీరోల ఫొటొలు ప్రొఫైల్ లో పెట్టుకోవడం, అవతలి హీరోల ఫ్యాన్స్ పట్ల చాలా హార్ష్ గా కామెంట్ లు పెట్టడం, మార్ఫింగ్ లు చేయడం, గేలి చేయడం కామన్ అయిపోయింది.

దీన్ని భరించలేక చాలా మంది సినిమా సెలబ్రిటీలు ట్విట్టర్ ను వదిలేసిన వైనాలు కూడా వున్నాయి. కొంతమంది కేవలం ఇన్ స్టా గ్రామ్ ను మాత్రమే నమ్ముకున్నారు. సహేతుకమైన విమర్శలు ఫ్యాన్స్ నుంచి రావడం లేదు. భయంకరమైన తిట్లు, బూతులు, కామెంట్లకు ట్విట్టర్ వేదికగా మారిపోయింది.

హీరోలు ఒకప్పకటి మాదిరిగా కాకుండా ఇప్పుడు చాలా వరకు కలిసి మెలిసి తరచు వేదికల మీద కనిపిస్తున్నారు. ఒకరి సినిమా ప్రచారానికి మరొకరు సహకరిస్తున్నారు. తామంతా ఒకటే అనే సందేశాన్ని తరచు ఫ్యాన్స్ కు పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా ఈ యుద్దాలు మాత్రం ఆగడం లేదు.

సినిమాకు యునానిమస్ టాక్ వస్తే అదృష్టం. లేదూ యావరేజ్ టాక్ వచ్చిందా, ఈ సోషల్ మీడియా యుద్దాలు దాన్ని చంపేస్తున్నాయి. సినిమా యూనిట్ లు కూడా సోషల్ మీడియా మీద ఆధారపడాల్సిన రోజులు వచ్చాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు అంటూ ప్రత్యేకంగా మీట్ లు నిర్వహిస్తున్నారు. దాంతో ఈ ప్రభావవంత స్థాయికి చేరుకోవడానికి ఫ్యాన్స్ మరింతగా కిందా మీదా అవుతున్నారు.

ఫ్యాన్స్ కు తర తమ బేధం వుండదు. తమ అభిమాన హీరో సినిమా నుంచి అయినా సరైన తీరులో అప్ డేట్ లు రాకపోతే, ఇక మామూలుగా తిట్టడం లేదు. సాహు, రాధేశ్యామ్ టైమ్ లో ఆ నిర్మాతలకు ఫ్యాన్స్ నుంచి ఓ లెక్కలో వ్యతిరేకత వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఇలాగే జరిగింది. దీంతో ఎన్టీఆర్ నే వేదిక మీద అప్ డేట్ ల గురించి క్లాస్ పీకాల్సి వచ్చింది.

సరే, ఇలా ట్విట్టర్ నో, ట్విట్టర్ స్పేస్ నో, ఫేస్ బుక్ నో ఫ్యాన్స్ వార్ కు వేదికగా మారితే కొంత వరకు భరించవచ్చు, సహించవచ్చు. కానీ అక్కడి నుంచి అది భౌతిక దాడుల వరకు మారితే భవిష్యత్ కాస్త దారుణంగానే వుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది హీరోలకు రాజకీయ అఫిలియేషన్లు కూడా వున్నాయి. బాలయ్య తెలుగుదేశం, పవన్ జనసేన వైపు వున్నారు. కొంతమంది హీరోలకు పరోక్షంగా పార్టీల అభిమానాలు వున్నాయనే టాక్ వుంది.

సో, ఫ్యాన్స్ వార్ లు కాస్తా పొలిటికల్ వార్ లు గా మారే ప్రమాదం ముందు..ముందు ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ రానున్నది ఎన్నికల కాలం. ఈసారి ఆంధ్రలో ఎన్నికల వార్ భయంకరంగా వుండబోతోంది. అందువల్ల ఈ వార్ లో ఎవరు నిజమైన ఫ్యాన్ నో, ఏది ఫేక్ అక్కౌంట్ నో తెలియని పరిస్థితి వుంటుంది. ఇందులో చిక్కుకుంటే జీవితాలు తల్లకిందలైపోతాయి.

హీరోలు, నటులు, దర్శకులు సినిమాలు చేసుకుంటూ, కోట్లకు కోట్లు గడించుకుంటూ, వాళ్ల జీవితం వాళ్లు బాగానే చక్కదిద్దుకుంటున్నారు. కానీ వాళ్లను నమ్ముకున్న ఫ్యాన్స్ మాత్రం క్షణికావేశాలకు గురైపోతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ల అసంతృప్తిని, ఆవేశాన్ని ఒక్క సెకెండ్ అంటే ఒక్క సెకెండ్ అణిచిపెట్టుకోలేకపోతున్నారు. ఇదే తీరు సోషల్ మీడియా దాటి బయటకు వస్తే దారుణంగా వుంటుంది.

దానికి ఉదాహరణే కావచ్చు వెస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన. హీరోలు, ఫ్యాన్స్ అంతా ఇలాంటి సంఘటనలను బలంగా ఖండిస్తే, కొంతయినా అరికట్టవచ్చేమో? నిన్న జరిగిన సంఘటన ఒకటో ప్రమాద హెచ్చరిక మాత్రమే. సోషల్ మీడియాను కట్టడి చేయకపోతే తరువాత తరువాత పరిస్థితులు దారుణంగా తయారవుతాయి.