అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తనే చంపేసింది ఆ మహా ఇల్లాలు. దీని కోసం ఆమె ఏకంగా సుపారీ ఇచ్చి ఓ గ్యాంగ్ ను రెడీ చేసింది. సైనేడ్ తెప్పించింది. అనుకున్నది సాధించింది. కానీ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది. గుంటూరు జిల్లాలో జరిగింది ఈ దారుణం.
బ్రహ్మయ్య ఓ చిన్న వ్యాపారి. గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఇతడికి ఓ హోటల్ ఉంది. పాల వ్యాపారం కూడా చేస్తాడు. బ్రహ్మయ్య భార్య మాత్రం పక్కచూపులు చూడడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అశోక్ రెడ్డి అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న బ్రహ్మయ్యను తొలిగించుకోవడానికి వీళ్లిద్దరూ పథకం వేశారు. అనుకున్నదే తడవుగా మచిలీపట్నం నుంచి పవన్ కుమార్, షేక్ షరీప్ లను రంగంలోకి దించారు. బ్రహ్మయ్యను చంపేందుకు వాళ్లతో 10 లక్షలకు డీల్ మాట్లాడుకున్నారు. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు.
సైనేడ్ తో బ్రహ్మయ్యను చంపాలని గ్యాంగ్ నిర్ణయించుకుంది. దీని కోసం వాళ్లు ట్రయిల్ కూడా వేశారు. సైనేడ్ కలిపిన బిస్కెట్లను కుక్కకు తినిపించి పరిశీలించారు. ఆ తర్వాత 4వ తేదీన హోటల్ కట్టేసి ఒంటరిగా ఇంటికి తిరిగొస్తున్న బ్రహ్మయ్య ముఖంపై వీళ్లు సైనేడ్ చల్లారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్య, కొద్దిసేపటికే చనిపోయాడు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా అశోక్ రెడ్డి అతడి గ్యాంగ్ ను పట్టుకున్నారు. మరింత కూపీలాగగా అక్రమ సంబంధమే కారణమనే విషయం బయటపడింది. దీంతో బ్రహ్మయ్య భార్యను కూడా అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు.ఈ కేసు మొత్తం వివరాల్ని శనివారం పోలీసులు బయటపెట్టారు.