'28వ పొజిషన్లో ఉన్న రాష్ట్రపు ముఖ్యమంత్రి వచ్చి ఐదో స్థానంలో ఉన్న రాష్ట్రానికి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా..' అంటూ సెటైరేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యానాలపై కేసీఆర్ ఇలా స్పందించారు.
అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత యోగి ఆదిత్యనాథ్ కు ఉందా? అన్నట్టుగా ఉంది కేసీఆర్ ప్రశ్న. యూపీ ముఖ్యమంత్రిగా అక్కడ ఉద్ధరించలేని ఆయన ఇక్కడకు వచ్చి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా కేసీఆర్ ఎద్దేవా చేశారు.
యోగి ఆదిత్యనాథ్ ను బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు తీసుకొచ్చిందనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో కేసీఆర్ అభివృద్ధి అంశాన్ని, పర్ క్యాపిటా విషయంలో రాష్ట్రాల ర్యాంకులను ప్రస్తావించారు.
యూపీ ర్యాంకు 28 అని, తమ ర్యాంకు ఐదో ర్యాంకు అని.. ఆయనొచ్చి ఇక్కడ పాఠాలు చెప్పడమేమిటి అని కేసీఆర్ ప్రశ్నించారు. అయితే బీజేపీ అభివృద్ధి, జీడీపీ అనే మాటను మాట్లాడానికి సిద్ధంగా లేదు. బీజేపీ అజెండా అంతా వేరే అని స్పష్టం అవుతూనే ఉంది.
ఎల్ఐసీ, రైల్వేస్, భెల్ వంటి లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మేస్తోందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో అరాచకం సృష్టించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.