తగ్గేదే లే.. : ఉద్యోగుల స్వరంపై జగన్ సీరియస్!

జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహంగా, అసహనంగా ఉన్నారు! ‘ధిక్కారమున్ సైతునా’ అన్నట్టుగా ఉద్యోగుల ఉద్యమ స్వరం మీద ఆయన గుర్రుగా ఉన్నారు. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిన తీరు ఈ అసహనానికి…

జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహంగా, అసహనంగా ఉన్నారు! ‘ధిక్కారమున్ సైతునా’ అన్నట్టుగా ఉద్యోగుల ఉద్యమ స్వరం మీద ఆయన గుర్రుగా ఉన్నారు. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిన తీరు ఈ అసహనానికి ప్రధాన కారణం. పోలీసు యంత్రాంగం ద్వారా.. ఉద్యోగులు అసలు విజయవాడకు చేరుకునే అవకాశమే లేకుండా రకరకాలుగా నియంత్రించాలని చూసినప్పటికీ.. ఉద్యోగ సంఘాల నాయకులు ఊహించిన దానికంటె ఎక్కువగా ఉద్యోగులు తరలి రావడం ఆయన ఆగ్రహానికి ఇతర కారణాలు. 

పీఆర్సీ విషయంలో తమకు అన్యాయం జరిగినట్టుగా భావిస్తున్న ఉద్యోగులు.. అనుమతులులేని బహిరంగ సభ ప్రసంగాలలో ప్రభుత్వం మీద నిరసన వరకు పరిమితం కాకుండా, తమ డిమాండ్లను వినిపించడంతో ఊరుకోకుండా.. రాజకీయ ప్రసంగాల తరహాలో.. ప్రభుత్వాన్ని పతనం చేస్తామని హెచ్చరించడం లాంటి అతి చేయడం కూడా.. జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవుతుండడానికి కారణంగా పలువురు భావిస్తున్నారు. 

ఛలో విజయవాడ కార్యక్రమం జరుగుతున్న సమయం నుంచే.. సీఎం జగన్ ఆ పరిణామాలై అప్‌డేట్స్ తెప్పించుకుంటూనే ఉన్నారు. మంత్రులతోను, సజ్జలతోను మాట్లాడి వ్యవహారాలను సమీక్షించారు. అయితే అందరికీ అర్థం కాని సంగతి ఒక్కటే. పోలీసులు ద్వారా విజయవాడకు చేరుకునే అన్ని మార్గాలను దాదాపుగా దిగ్బంధం చేసినప్పటికీ.. నిషేధాజ్ఞలు విధించినప్పటికీ, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ప్రతివాహనాన్నీ తనిఖీ చేసినప్పటికీ అంతమంది నగరానికి ఎలా చేరుకోగలిగారన్నదే అందరికీ పెద్ద ప్రశ్న.

రెండు రోజులముందుగానే ఉద్యోగులు నగరానికి చేరుకున్నారని.. మారువేషాల్లో వచ్చారని, బురఖాలు వేసుకుని వచ్చారని.. ఇలా రకరకాల కారణాలు వినిపిస్తున్నప్పటికీ.. కేవలం అలాంటి ప్రయత్నాల ద్వారా అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలిరావడం అనేది అసాధ్యం అనే సంగతి అందరికీ తెలిసినదే. అందుకే ఈ విషయంలో పోలీసు వైఫల్యం ఉన్నదని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసు వైఫల్యం ఎంత మేర ఉన్నదో పరిశీలించాలని డీజీపీ గౌతం సవాంగ్ ను పురమాయించినట్లుగా కూడా తెలుస్తోంది. 

ఉద్యోగుల నిరసనలు, ఉద్యమాలు, పోరాటప్రణాళికలు ఇక్కడితో అయిపోలేదు. 6వ తేదీనుంచి సమ్మె జరగబోతోంది. ఆ సమయంలో ఉద్యోగులు ఇంకెన్నెన్ని దూకుడు ఆలోచనలో చేస్తారో ఇప్పుడే ఊహించలేం. అలాంటి సందర్భాలకు తగినట్టుగా పోలీసులు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ముఖ్యమంత్రి డీజీపీతో చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి ఇంత సీరియస్ గా పరిగణించే వారు కాదని, ఉద్యోగ సంఘాల నాయకులు తమ పరిధి మరిచి, రాజకీయ నాయకుల్లాగా ప్రభుత్వం మీద నిందాత్మకమైన ప్రసంగాలు చేయడం అందుకు కారణమని అంటున్నారు. 

పోలీసులు సహకరించారా.. అనే కోణంలో జగన్ కు అనుమానాలు ఉండవచ్చు గానీ.. పోలీసులు సహకరించకుండా ఉంటారని అనలేం. ఎందుకంటే.. ఉద్యోగుల పోరాటాలు ఫలిస్తే.. ఆ లాభం పోలీసులకు కూడా దక్కుతుంది కాబట్టి. అసలే పోలీసులకు కూడా ఉద్యోగుల దీక్షల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. విధి రీత్యా గతిలేక వారికరి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోలీసుల పేరిట చాలా పోస్టులు సర్కులేట్ అవుతున్నాయి కూడా. ఇలాంటి నేపథ్యంలో.. ‘పోలీసులు సహకరించారా?’ అనే అనుమానం ఎవ్వరికైనా పుట్టడం సహజం. 

ఈ అనుమానాలను మించి.. ఉద్యోగుల భవిష్య కార్యచరణ అదుపు తప్పకుండా.. ఏం చేయాలో.. డీజీపీతో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే బాగుంటుంది.