ఆంధ్రలో సినిమా టికెట్ రేట్లు ఇస్తారు అనుకున్నపుడల్లా ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడి వ్యవహారం చెడేలా చేస్తున్నారు. ఈసారి చూస్తుంటే రచయిత కమ్ డైరక్టర్ మచ్చ రవి వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ మీద పరోక్షంగా ట్వీటు వేసారు.
‘’..అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది…’’
ఇది ఆయన కచ్చితంగా ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి వేసిన ట్వీట్ అని అర్థం అయిపోతూనే వుంది. దాంతో దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా ట్విట్టర్ లో హడావుడి మొదలయింది. దాని మీదే దర్శకుడు హరీష్ శంకర్ కు మచ్చరవికి ఏవోవో ట్వీట్ల వాదనలు నడచాయి.
అదంతా అలా వుంచితే ఇప్పుడు వైకాపా కార్యకర్తలు, అభిమానులు రంగంలోకి దిగిపోయారు. హరీష్ శంకర్ కు మచ్చరవికి ఫోన్ లు మొదలైపోయాయి. దీంతో హరీష్ శంకర్ ఇండస్ట్రీలో వైకాపాతో సంబంధాలు వున్న ఒకరికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద మచ్చరవి లాంటి చిన్న దర్శకుడికి కూడా ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ అలుసైపోయారు అన్న భావన మొదలైంది. ఇప్పుడు ఈ వ్యవహారం వైకాపా హై కమాండ్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర సిఎమ్ ను కలిసి వచ్చారు. ఎవ్వరినీ ఏమీ మాట్లాడవద్దన్నారు.
కానీ మచ్చరవి ఆ మాటలు పెడచెవిన పెట్టి వైకాపాను కెలికారు. ఇప్పుడు మరి ఏమవుతుందో చూడాలి.