Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: సామాన్యుడు

మూవీ రివ్యూ: సామాన్యుడు

టైటిల్: సామాన్యుడు
రేటింగ్: 2/5
తారాగణం: విశాల్, డింపుల్ హయతి, రవీన రవి, యోగి బాబు, తులసి, ఎలాంగో కుమారవేల్ తదితరులు 
కెమెరా: కెవిన్ రాజ్
ఎడిటింగ్: ఎన్.బి. శ్రీకాంత్ 
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నిర్మాత: విశాల్
దర్శకత్వం: తు.ప. శరవణన్
విడుదల తేదీ: 4 ఫిబ్రవరి 2022

తమిళంలో నేడు విడుదలైన "వీరమై వాగై సూడుం" కి తెలుగు డబ్బింగ్ ఈ "సామాన్యుడు". తెలుగురాష్ట్రాల్లో పెద్దగా ప్రచారం జరుపుకోని ఈ సినిమా కేవలం విశాల్ కి ఒక వర్గం ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ మీద ఆధారపడి విడుదలయింది. 

మూడు వేరు వేరు కథలు ఒక చోటుకి చేరి హీరో ప్రతీకారం తీర్చుకోవడంతో సుఖాంతమయ్యే కథ ఇది. ఆలోచన మంచిదే కానీ కథలో భావోద్వేగాల్ని పండించడానికి తగిన కృషి మాత్రం చేసినట్టు కనపడదు. 

సీను తర్వాత సీను వేసుకుంటూ పోతే అది లైనార్డరవుతుంది తప్ప మనసుని పట్టుకునే కథైపోదు. ప్రతి సీన్ మరియు షాట్ యొక్క పర్పస్ లెక్కేసుకుంటూ తెరకెక్కిస్తే తప్ప కథ పండదు. 

సినిమా మొదలైన మొదటి పావుగంటకి ఇదేదో చీదేసే సినిమా ఆనిపిస్తుంది. ఆర్టిస్టుల బలహీనమైన నటన కానీ, మెరుపుల్లేని సంభాషణలు గానీ, గ్రిప్ లేని కథాగమనం గానీ "ఇలా ఇంకా రెండు గంతలు భరించాలా" అనిపిస్తాయి. 

కానీ క్రమంగా కథనం కాస్త పట్టుబడి పై అభిప్రాయాన్ని దూరం చేస్తుంది. 

మూడు కథల్ని సమాంతరంగా నడపడం వల్ల స్క్రీన్ ప్లే పరంగా ఆసక్తి రేకెత్తి ఏదో జరగబోతోంది అనే అంచనాలు కలుగుతాయి. ఇంటర్వెల్ కి వచ్చే సరికి కథ గాడిలో పడిందనిపిస్తుంది. 

కానీ రెండవ సగమంతా ఊహాతీతంగా ఏదీ జరగదు. సస్పెన్స్ కూడా ఏమీ ఉండదు. ప్రేక్షకులకి రివీలైపోయిన విషయం హీరోకి రివీలవ్వాలంతే. అది జరిగిపోతే ఇక క్లైమాక్స్ ఫైటే అని వందలాది సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులకి గెస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సరిగా అదే జరుగుతుంది తెరమీద. 

దర్శకత్వపరంగా అద్భుతాలేవీ లేవు. బి-సి సెంటర్ ప్రేక్షకులకి తగ్గట్టుగా రాసుకున్న కథా కథనాలివి. తెలివితేటల కంటే దర్శకుడి సౌకర్యార్థం బలవంతంగా చేసుకున్న ఏర్పాట్లు చాలానే ఉన్నాయి ఈ కథనంలో. 

ఎంత సాగతీతున్నా ఎడిటింగ్ పనితనం వల్ల పెద్దగా భారమనిపించదు. ఎటొచ్చీ సీట్ చివరలో కూర్చుని గోళ్లు కొరుక్కుంటే చూసేంత ఉత్కంఠ లేకపోవడం ఒకటే మైనస్. 

ఎంత సామాన్యుడు అనే టైటిల్ పెడితే మాత్రం మరీ ఇంత సామాన్యంగా తీయాలా?

అలాగని హీరో మాత్రం పూర్తిసామాన్యుడు మాత్రం కాదు. 16 మంది రౌడీలను ఒంటి చేత్తో మట్టి కరిపించేస్తాడు. వాళ్లంతా ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ కూడా అవ్వరు. అదీ పరిస్థితి. అలా కొట్టగలిగేవాడు సామాన్యుడెలా అవుతాడు?

సంగీతపరంగా సినిమా ఓకే. పాటలు మాత్రం వీక్. కెమెరా వర్క్ బాగుంది. 

విశాల్ నటన మాస్ ని మెప్పించేదిగా ఉంది. అలాగని కొత్త మెరుపులేవీ లేవు. 

డింపుల్ హయతి పాత్రమాత్రం వృధా అయింది. ఆమె పాత్రకి అసలు విలువేలేదిందులో. ఏదో హీరోయినుండాలి కాబట్టి ఉన్నట్టుందంతే. 

తులసి ఓవర్యాక్షన్ చేసినా పాత్రోచితంగా సరిపోయింది. 

యోగిబాబు పేరుకి కమెడియనే అయినా కామెడీ మాత్రం అస్సలు పండలేదు. 

సీతారామశాస్త్రిగారబ్బాయి రాజా విలన్ గా సైడు పాత్రకొటి చేసాడు. దానివల్ల అతనికి హెల్పయ్యేదేం లేదు.

మిగిలిన నటీనటులంతా కుదిరితే ఓవరాక్షన్ చేసారు. లేకపోతే అసలు యాక్షన్ రానట్టు కనిపించారు.

తెలుగు సైన్ బోర్డులు, లొకేషన్స్ పెట్టి డైరెక్ట్ తెలుగు సినిమాగా కలరిచ్చే తిప్పలు పడ్డారు కానీ ప్రధానంగా ఆర్టిస్టుల వల్ల, వారి నటనాశైలివల్ల అరవ వాసన పోలేదు. 

విశాల్ నిర్మాతగా నిర్మించి నటించిన ఈ సినిమానుంచి ఏమి ఆశించాడో, ఆశించిన ఫలితం దక్కిందో లేదో తెలియదు కానీ కంటెంట్ పరంగా మాత్రం మరింత బలంగా ఉండాల్సిన చిత్రమిది. 

బాటం లైన్: మరీ సామాన్యంగా ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?