అనగనగా ఓ రాజుగారు. మనుషుల్ని నమ్మలేక, బాగా శిక్షణ ఇచ్చిన గొరిల్లాను బాడీగార్డ్ గా పెట్టుకున్నారు. రాత్రి వేళ కత్తి పట్టుకుని చుట్టూ రాజుగారి మంచం చుట్టూ తిరిగేదట ఆ గొరిల్లా. ఓ రోజు ఓ దోమ రాజుగారి పీక మీద వాలింది. అంతే గొరిల్లా కత్తి సర్రున దూసి పీక మీద వేసింది. రాజుగారు కాస్తా ఫట్. అందుకే తెలివితక్కువ మిత్రుడి కన్నా తెలివైన శతృవే మిన్న అని పెద్దలు చెబుతారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహారం అచ్చంగా ఇలాగే వుంది. ఆయన తన అనునాయులను, రాజకీయనాయకులను అస్సలు నమ్మరు. కానీ అలా అని వాళ్లను దూరం పెట్టరు. తాను అనుకున్నవి వాళ్ల ద్వారా చేయిస్తారు. అలా అని పూర్తిగా ఆయనే ఆలోచించరు. ఆలోచనల విషయంలో మాత్రం కొంత మంది అధికారులను గుడ్డిగా నమ్ముతారు. వారు చెప్పింది వేదంగా భావిస్తారు. వాళ్లు తప్పుదారి పట్టిస్తే, గుడ్డిగా ఫాలో..ఫాలో అంటారు. చిక్కుల్లో పడతారు. అయినా మొండిగానే ముందుకు వెళ్తారు. చాలా మంది చేతులు కాలిపోయిన తరువాత అయినా ఆకులు పట్టుకుంటారు. కానీ ఈయన స్టయిల్ వేరు. కాలిపోతే కాలిపోనీండి. నా చేతులే కదా? అంటారు. మీకేం నష్టం లేదు కదా? కాలింది చేతులే కదా అని ముక్తాయిస్తారు.
ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఎలా భావిస్తున్నారంటే ‘తాను కష్టపడి సాధించిన అధికారం, తాను జైల్లో పడి, వీధుల్లో పడి ఏళ్ల పాట కష్ట పడి సంపాదించిన అధికారం, తన వల్లే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు తేడావచ్చి నష్టపోయినా తనే అనే’. కానీ ఇక్కడ ఆయన విస్మరిస్తున్న పాయింట్ ఏమిటంటే, అధికారం సాధించడం ఆయన కష్టం వల్లే సాధ్యం అయి వుండొచ్చు. కానీ దానికి రాళ్లెత్తిన కూలీలు చాలా మంది వున్నారు. చొక్కాలు చించుకున్నవారు వున్నారు. శతృవులను పెంచుకున్నవారు వున్నారు. అధికారం పోతే జగన్ కు వచ్చిన నష్టం లేదు. ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటారు. కానీ ఆయనను నమ్ముకుని రాజకీయాలు చేసిన వారు రేపు పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుంది.
సరే, మళ్లీ కాస్త వెనక్కు వస్తే, జగన్ రాజకీయ నాయకులను అస్సలు నమ్మరు. సుబ్బారెడ్డి, విజయుసాయి రెడ్డి, సజ్జల వీరంతా ఆయనకు నమ్మకస్తులు అని కాదు. ఆయనకు పోస్ట్ మాన్ లు. ఇలా అనడం తప్పో, ఒప్పో తెలియదు. కానీ విషయం అదే. ఆయన వారి చేత తాను చేయాలనుకున్నవి, చేయించాలనుకున్నవి చేయిస్తారు. వాళ్లనే నమ్మే విషయం అయితే సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చి వుండేవారు. షర్మిలకు పదవి ఇచ్చి వుండేవారు.
ఆయన ప్రశాంత్ కిషోర్ ను నమ్ముతారు. ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులను నమ్ముతారు. వాళ్లు చెప్పిందే వేదంగా భావిస్తారు. వాటిల్లో సాధ్యాసాధ్యాలు, మంచి చెడ్డలు,ఆయన ఆలోచించరు. పట్టించుకోరు. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్లే. లేదూ అంటే ఎప్పటిదో చెన్నయ్ జీవో పాతది తీసుకువచ్చి ఇస్తే, రాత్రికి రాత్రి సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ అమలు చేసేయమనడం ఏమిటి? ఈ జీవో కరెక్ట్ నా కాదా? ఇది అమలు చేస్తే ఏమవుతుంది? ఎలా టర్న్ తీసుకుంటుంది అన్నది అస్సలు ఆలోచన చేసి వుండరు. చేసి వుంటే అది అమలు చేయరు కదా? దాని వల్ల ఏమయింది? వ్యవహారం రచ్చ రచ్చ అయింది. కోర్టు దాకా పోయింది. నానా గడబిడ.
ఎన్ జి వో లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం కూడా ఇలాంటిదే. 27శాతం తాత్కాలిక పెంపు ఇస్తున్నారు. ఫైనల్ పెంపు 23 శాతం అంటే నాలుగు శాతం జీతాలు తగ్గిపోతాయి కదా? మెడమీద తలకాయ వున్నవారు ఎవరైనా చెప్పేదే ఇది. ఈ మాత్రం విషయం జగన్ కు తట్టలేదా? పోనీ జీతాలు పెంచలేను ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఆ 27శాతం తాత్కాలిక పెంపునే ఖాయం చేస్తాను అని ముందే నచ్చ చెప్పి వుండాల్సింది కదా? అలా 27 శాతం ఫిక్స్ చేసి, దానిపై డిఎలు ఇచ్చి వుంటే ఎంతో కొంత పెంపు కనిపించేది. డిడక్షన్ అనేది వుండేది కాదు.
ప్రపంచంలో ఎవ్వరైనా పెడతాం అంటే ఓకె అంటారు కానీ తిడతాం అంటే కాదు కదా? జీతాలు పెంచం అన్నా ఒప్పుకుంటారేమో కానీ తగ్గిస్తాం అంటే ఎవ్వరు అంగీకరిస్తారు. ఇదేం ప్రయివేటు కంపెనీల వ్యవహారం కాదు కదా. కరోనా అని జీతాలు ఇవ్వకున్నా, తగ్గించినా నోరు మూసుకుని వుండడానికి. ఇదే ప్రయివేటు కంపెనీ అయితే జీతం తక్కువయిందని సమ్మె చేసే సీన్లు లేవు ఇప్పుడు. మానేసి మరో కంపెనీ చూసుకోవడమే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కదా, బంగారం లాంటి ఉద్యోగం వదులుకోలేరు. అందుకే సమ్మె బాట పట్టారు.
జగన్ కు 27 శాతానికి బదులు 23 శాతం ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది. లేదా అలాంటి ఆలోచనకు ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఎలా బుర్ర ఊపారు? కేవలం ఎవరో సిఎమ్ఓ అధికారి ఇచ్చిన బుర్రతక్కువ సలహాకు ఆయన తల ఊపి వుంటారు. ఇప్పుడు దాన్ని సర్ది చెప్పడానికి మాత్రం సజ్జల, బొత్సాలు కావాల్సి వస్తారు. అంతే కానీ జగన్ ముందుకు రారు. సంబంధిత సిఎమ్ఓ అధికారులు ముందుకు రారు.
ఏమి? బొత్స, సజ్జల ఎందుకు? నిర్ణయం తీసుకున్నది జగన్ నే కదా? ఆయనే యూనియన్లతో సమావేశం కావచ్చు కదా? లేదా ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా? అసలే జగన్ ను ఎన్ని విధాల యాగీ చేయవచ్చు, ఎలా గద్దె నుంచి కిందకు లాగేయవచ్చు అని తెలుగుదేశం పార్టీ చూస్తోంది. ఇక దాని మూలాల్లో వున్న సామాజిక వర్గం సంగతి సరేసరి. ఇక దాని మద్దతు మీడియా వైనం వుండనే వుంది. ఇప్పుడేమయింది. మూడు శాతంతో పోయేదానికి ఇంత పీకల మీదకు వచ్చింది. చచ్చు సలహా ఇచ్చిన అధికార పెద్దాయిన సైలంట్ గా వుంటారు. దాని పట్టుకుని వేలాడుతున్న జగన్ చేతులు కాలిపోతున్నాయి. సర్ది చెప్పలేక బొత్స, సజ్జల నానా పాట్లు పడాలి.
ఇంత జరిగిన తరవాత మూడు శాతం ఇవ్వొచ్చు. కానీ ఎవరిది విజయం? ఎవరిది అపజయం? ఇప్పుడు కింకర్తవ్యం. ఉద్యోగులు ఛలో విజయవాడ అని పిలుపు ఇచ్చినపుడు దానిలో ప్రతిపక్షాలు సైలంట్ గా పార్ట్ తీసుకుంటాయనే చిన్న ఆలోచన ఓ పార్టీ అధినేతగా జగన్ కు లేదా? మరి అలా అయితే ఇక ఆయనేం రాజకీయాలు చేయగలరు? ప్రతీదీ దండోపాయంతో నెగ్గుకు రావడం అనే ఆలోచనే సరైనది కాదు.
పోనీ ఉద్యోగుల ఉద్యమాన్ని కఠినంగా అణచివేద్దాం అని అనుకున్నారు అనుకుందాం. అప్పుడు ఆ దారిలో వెళ్లాలి కదా? అక్కడా తప్పటడుగులే. బిల్లులు చేసి తీరాల్సిందే అని మెమో లు జారీ చేసి కూడా అలా చేయని వారిపై చర్య తీసుకోగలిగారా? ఛలో విజయవాడ నాడు విధులకు హాజరు కావాల్సిందే అని హుకుం జారీ చేసి కూడా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోగలిగారా? అదీ లేదు. ఇంకెందుకు భయపడాలి జగన్ అంటే. అంతా మేకపోతు గాంభీర్యం అనుకోరా?
మొత్తం మీద అందివచ్చిన అధికారాన్ని జగన్ సరిగ్గా నిర్వహించలేకపోతున్నారనే బలమైన అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షానికి జగన్ నే అస్త్రాలు అందిస్తున్నారు. అది సినిమా టికెట్ లు అయితేనేం, ఉద్యోగుల వ్యవహారం అయితేనేం. మొత్తం మీద జగన్ చేతులు కాల్చుకుంటున్నారు. కానీ కాలిపోతున్నవి ఆయన చేతులు మాత్రమే కాదు. ఆయనను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నవారి బతుకులు కూడా. ఆ వైనం ఆయన ఇప్పటికైనా గమనిస్తే, కాలిన గాయాలు మానుపడతాయి. లేదంటే…ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
చాణక్య