దింపుడు కళ్లం ఆశతో..

ఉద్యోగుల ఉద్య‌మ పంథాలో కీల‌క ప‌రిణామం. ఏపీ స‌చివాల‌యంలో మంత్రుల క‌మిటీతో పీఆర్సీ సాధ‌న స‌మితి నాయ‌కులు చ‌ర్చ‌ల‌కు కూర్చున్నారు. ఇది అనూహ్య ప‌రిణామంగా చెప్పొచ్చు. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు ప్ర‌భుత్వంతో ఉద్యోగ సంఘాల…

ఉద్యోగుల ఉద్య‌మ పంథాలో కీల‌క ప‌రిణామం. ఏపీ స‌చివాల‌యంలో మంత్రుల క‌మిటీతో పీఆర్సీ సాధ‌న స‌మితి నాయ‌కులు చ‌ర్చ‌ల‌కు కూర్చున్నారు. ఇది అనూహ్య ప‌రిణామంగా చెప్పొచ్చు. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు ప్ర‌భుత్వంతో ఉద్యోగ సంఘాల నేత‌లు చ‌ర్చించినా, ఎలాంటి పురోగ‌తి లేని విష‌యం తెలిసిందే. దీంతో అనివార్యంగా స‌మ్మె బాట ప‌ట్టాల్సి వ‌స్తోంద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

గురువారం చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ఊహించ‌ని స్థాయిలో విజ‌య‌వంతమైంది. మ‌రోవైపు రేప‌టి నుంచి ఉద్యోగులు స‌హాయ నిరాక‌ర‌ణ‌, ఆదివారం అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెలోకి వెళ్ల‌నున్న నేప‌థ్యంలో కాసేప‌టి క్రితం కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఉద్యోగుల డిమాండ్లు, ఆందోళ‌న హెచ్చ‌రిక‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సీఎ జ‌గ‌న్‌… మంత్రుల క‌మిటీతో చ‌ర్చించారు. ఆ త‌ర్వాత పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌ల‌తో చ‌ర్చించేందుకు వెళ్ల‌డంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.

ఉద్యోగ సంఘాల నేత‌లు త‌మ‌తో చ‌ర్చ‌ల‌కు రావాల‌ని, అన‌వ‌స‌రంగా స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేయొద్ద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు విన్న‌వించ‌డంతో పాటు సున్నితంగా హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ ఉద్యోగులు స‌మ్మెకు వెళితే ప్ర‌జాజీవ‌నానికి అంత‌రాయం క‌ల‌గ‌కుండా తాము ఏం చేయాలో అది చేస్తామ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే హెచ్చ‌రించింది. మ‌రోవైపు పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌లు ప్ర‌ధానంగా మూడు డిమాండ్ల‌ను మంత్రుల క‌మిటీ ముందు పెడుతోంది.

కొత్త పీఆర్సీ జీవోలు ర‌ద్దు చేయ‌డం, పాత జీతాలే వేయ‌డం, అలాగే అశుతోష్ మిశ్రా క‌మిటీ నివేదిక‌ను బ‌య‌ట పెట్టాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ప‌దేప‌దే డిమాండ్ చేస్తున్నారు. వాటిపై సానుకూలంగా స్పందించ‌క‌పోతే చ‌ర్చ‌ల్లో పురోగ‌తి ఉండ‌ద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ అనూహ్యంగా శుక్ర‌వారం సాయంత్రం ఏపీ స‌చివాల‌యంలో చ‌ర్చ‌ల‌కు కూచోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది. 

బ‌హుశా ఇరువైపులా దింపుడు క‌ళ్లెం ఆశ‌తోనే చర్చ‌ల‌కు కూచున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగుల డిమాండ్ల‌ను కాలం చెల్లిన‌విగా మంత్రుల క‌మిటీ చెబుతున్న నేప‌థ్యంలో ఇలాంటి అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.