ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వెటకరించారు. ఐఆర్‌పై సీఎస్ చెప్పిన అంశాలపై సూర్యనారాయణ వ్యంగ్యాస్త్రాలను సంధించడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులను కూడా ఉద్యోగ సంఘాల నేతలు విడిచి పెట్టడం లేదు. ప్రభుత్వ పెద్దలు ఒక మాటంటే, దానిపై ఉద్యోగ సంఘాల నేతలు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తుండడాన్ని గమినించొచ్చు. సీఎస్ సమీర్‌శర్మ ఏమన్నారు, సూర్యనారాయణ కౌంటర్ ఏంటో తెలుసుకుందాం.
చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత గురువారం సీఎస్ సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మీడియా ముందుకొచ్చారు. సమీర్‌శర్మ మాట్లాడుతూ …”ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే మధ్యంతర భృతి (ఐఆర్) వడ్డీ లేని అప్పు లాంటిదన్నారు. దాన్ని తర్వాత సర్దుబాటు చేస్తామన్నారు. ఇది ఏ పీఆర్సీలోనైనా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా 30 నెలల పాటు 27 శాతం ఐఆర్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఐఆర్ ఉద్యోగుల హక్కు కాదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల పుండుపై కారం చల్లినట్టైంది. ఒకవైపు నూతన పీఆర్సీతో వేతనాలు తగ్గిపోతాయని తాము ఆవేదన చెందుతుంటే, ప్రభుత్వానికి వంత పాడుతూ ఐఏఎస్ అధికారులు వక్రభాష్యం చెబుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పీఆర్సీ నేతల స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
అనంతరం పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ మాట్లాడుతూ సీఎస్ సమీర్‌శర్మపై సెటైర్స్ విసిరారు. గతంలో ఎప్పుడూ మధ్యంతర భృతి వెనక్కి తీసుకోలేదన్నారు. మధ్యంతర భృతి అనేది వడ్డీలేని రుణమని తమకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు. మధ్యంతర ఉపశమనం ఏ విధంగా రుణంగా కనిపించిందో అధికారులే చెప్పాలని దెప్పి పొడిచారు.
ఐఏఎస్‌లా గొప్ప చదువులు చదవకపోయినా ఇది సాధారణ లెక్కలేనని ప్రతి ఉద్యోగికి తెలుసని ఆయన వెటకరించారు. ఇరువైపులా మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య రోజురోజుకూ గ్యాప్ పెరుగుతోందనేందుకు విమర్శలు, ప్రతివిమర్శలే నిదర్శనం.