కాపు ఉద్యమనాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞత లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం జగన్‌ను కలవాలని ఉన్నా… విమర్శలను ఎదుర్కోలేక కలవలేకపోతున్నందుకు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాపులను బీసీల్లో చేర్చుతామని, రిజర్వేషన్ కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఆశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి, అత్యధిక జనాభా కలిగిన కాపులంతా టీడీపీ-బీజేపీ కూటమికి భారీగా ఓట్లు వేశారు.
అధికారం దక్కించుకోవాలన్న చంద్రబాబు ఆశయం నెరవేరింది. కానీ కాపులకు ఇచ్చిన హామీని మాత్రం చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. హామీని నెరవేర్చాలంటూ ముద్రగడ నేతృత్వంలో కాపులంతా రోడ్డెక్కారు. అయితే ఉద్యమ బాట పట్టిన కాపులపై చంద్రబాబు కర్కశంగా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై భారీగా కేసులు నమోదు చేశారు. తుని దుర్ఘటనకు బాధ్యులను చేస్తూ, అనేక మంది అమాయక కాపులపై బాబు హయాంలో కేసులు నమోదు చేసి మానసికంగా హింసించారు.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గతంలో కాపులపై నమోదైన కేసులన్నింటిని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు హర్షం వ్యక్తం చేస్తూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో గతంలో కాపులు అనుభవించిన మానసిక వేదనను ప్రస్తావించారు. ఆ లేఖలో ఏమున్నదంటే…
“కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. చేయని నేరానికి మమ్మల్ని ముద్దాయిలను చేస్తూ.. గతంలో పెట్టిన కేసులు చాలా అన్యాయం. ఇప్పుడు వాటిని ఎత్తివేయడం సంతోషం కల్గించింది. కాపుజాతి నన్ను ఉద్యమం నుంచి తప్పించినా.. భగవంతుడు సీఎం వైఎస్ జగన్ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించారు.
గత ప్రభుత్వం కేసులతో తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. దాన్ని మీరు పూర్తిగా తొలగించారు. ఎంతో సాయం చేసిన మిమ్మల్ని కలవాలని ఉన్నా… కలవలేక పోతున్నా. ఒకవేళ కలిస్తే కాపు ఉద్యమాన్ని అమ్మేశాననో, తాకట్టు పెట్టాననో ఒక నీచమైన ప్రచారానికి తెగబడతారు. ఇప్పుడు ఆ నీచ ప్రచారాన్ని ఎదుర్కోలేను. నేను పుట్టుకతో కోటీశ్వరుడిని కాదని, డబ్బులకు అమ్ముడుపోయే వాడిని కాదని అందరికీ తెలుసు. అయినా నీచమైన ప్రచారానికి తెరలేపుతారు. మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు తెలుపుదామని ఉన్నా కూడా కలవలేని పరిస్థితి నాది.
ఎప్పుడు ఏ పాపం చేశానో తెలియదు కానీ, ఇప్పుడు ఈ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రిని ఎవరెవరో కలుస్తుంటారని, కానీ కాపు ఉద్యమకారులకు ఎంతో మంచి చేసిన జగన్‌ను కలవలేకున్నాను. కలిస్తే తమ జాతిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించుకోవడానికి, పదవులు పొందడానికి వెళ్లానని అనిపించుకోవడం ఇష్టంలేక కలవలేకపోతున్నా” అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.