రేవంత్‌, ఈట‌ల‌కు విజ‌య‌శాంతి హిత‌వు

టీకాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో పాటు త‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు విజ‌య‌శాంతి హిత‌వు చెప్పారు. ప్ర‌తిప‌క్ష పార్టీల క‌ల‌హాలు అంతిమంగా బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని ఆమె…

టీకాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో పాటు త‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు విజ‌య‌శాంతి హిత‌వు చెప్పారు. ప్ర‌తిప‌క్ష పార్టీల క‌ల‌హాలు అంతిమంగా బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్‌పై ఈట‌ల ఘాటు విమ‌ర్శ‌, రేవంత్ స‌వాల్ విస‌ర‌డంపై విజ‌య‌శాంతి ట్విట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాల్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.

మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించ‌డంపై రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. ఈటల ఆరోప‌ణ‌లు అవాస్త‌మ‌ని తేల్చేందుకు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. త‌న స‌వాల్‌ను స్వీక‌రించేందుకు ఈట‌ల సిద్ధ‌మా అని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌శాంతి వ‌రుస‌గా చేసిన ట్వీట్ల‌లో ఏముందో తెలుసుకుందాం.

“ఈ విధానాన్ని అధికారపార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక, ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల, సవాళ్ల దాడులు, బీఆర్ఎస్‌కు వేడుకలవుతున్నాయి. బీఆర్ఎస్‌తో పోరాడే తమ్ముళ్లు రేవంత్,ఈటల తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో కొంచెం ఆలోచించాలి. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ… నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించింది”

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లో బీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేయాల‌న్న స్పృహ ఎంత‌గా ఉన్న‌దో విజ‌య‌శాంతి సూచ‌న‌లే నిద‌ర్శ‌నం. ఇదే రీతిలో ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల కూడా ప్ర‌తిప‌క్షాల్ని క‌లిసి ఐక్యంగా పోరాడుదామ‌ని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌క‌పోతే తెలంగాణ స‌మాజం శాశ్వ‌తంగా న‌ష్ట‌పోతుంద‌నే ఆవేద‌న ప్ర‌తిప‌క్షాల్లో క‌నిపిస్తోంది. 

అయితే రాజ‌కీయంగా బ‌ద్ద శ‌త్రువులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు… తెలంగాణ‌లో మాత్రం కాస్త స్నేహ‌పూర్వ‌క ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. రాజ‌కీయ విభేదాల కంటే పెద్ద శ‌త్రువుని ఎదుర్కోవ‌డమే ముఖ్య‌మ‌నే ఆలోచ‌న వారిలో క‌నిపిస్తోంది.