బాబు, ప‌వ‌న్ కోరుకున్న‌దే…జ‌రుగుతోందా?

2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లు వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు కీల‌కం. వైసీపీని ఒంట‌రిగా ఎదుర్కోలేమ‌ని టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లకు బాగా తెలుసు. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పేశారు. చంద్ర‌బాబు…

2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లు వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు కీల‌కం. వైసీపీని ఒంట‌రిగా ఎదుర్కోలేమ‌ని టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లకు బాగా తెలుసు. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పేశారు. చంద్ర‌బాబు మాత్రం మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌వ‌న్‌కు రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేక‌పోవ‌డంతో త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు. నిజానికి ప‌వ‌న్‌తో చంద్ర‌బాబుకు రాజ‌కీయ అవ‌స‌రం చాలా వుంది.

ఎన్నిక‌లకు రెండు మూడు నెల‌ల ముందు వ‌ర‌కూ ప‌వ‌న్ స్వ‌తంత్రంగా రాజ‌కీయం చేసి వుంటే క‌థ వేరేలా వుండేది. కానీ సీఎం జ‌గ‌న్‌పై పెంచుకున్న విద్వేషాగ్ని ఆయ‌న్ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌లేదు. చంద్ర‌బాబు కంటే ప‌వ‌నే ఎక్కువ‌గా రెచ్చిపోతున్నారు. 

జ‌గ‌న్‌ను గ‌ద్దె దించే బాధ్య‌త‌ను తానే తీసుకుంటాన‌ని ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌క‌టించారు. కానీ ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయ కార్య‌క‌లాపాలేవీ లేవు. ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి విడిపోవ‌డానికి, అలాగే చంద్ర‌బాబుతో క‌ల‌వ‌డానికి ప‌వ‌న్‌కు ఒక బ‌ల‌మైన సాకు కావాలి.

మ‌రోవైపు చంద్ర‌బాబు, ప‌వ‌న్ కోరుకున్న‌ట్టుగానే వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై రాళ్లు రువ్వ‌డం, ఇందుకు మంత్రి సురేష్ నాయ‌క‌త్వం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. బాబు ప‌ర్య‌ట‌న‌పై రాళ్లు రువ్వ‌గానే, తానున్నానంటూ ప‌వ‌న్ క‌ల్యాన్ ర‌య్‌మంటూ ముందుకొచ్చారు. విశాఖ‌లో త‌న‌పై కూడా అధికారాన్ని ఉప‌యోగించి అణిచివేత చ‌ర్య‌లు చేప‌ట్టారంటే ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

చంద్ర‌బాబుపై రాళ్ల దాడిని ప‌వ‌న్ ఖండించారు. త‌మ‌ను చూస్తే జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎందుకంత అభ‌ద్ర‌తా భావమ‌ని ఆయ‌న నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. బాబుతో పాటు త‌న‌ను కూడా క‌లుపుకుని మాట్లాడాన్ని గ‌మ‌నించొచ్చు. బాధ్య‌త విస్మ‌రించిన చోట క‌చ్చితంగా ప్ర‌తిప‌క్షం ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీ కార్య‌క్ర‌మాల‌ను చూసి అధికార పార్టీ వైసీపీ అభ‌ద్ర‌త‌కు లోన‌వుతోంద‌ని ఆయ‌న అన‌డం గ‌మ‌నార్హం. టీడీపీ, జ‌న‌సేన వేర్వేరు కాద‌ని ఆయ‌న ప‌రోక్షంగా ఈ ప్ర‌క‌ట‌న ద్వారా చెప్ప‌ద‌లుచుకున్నారు.  

ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను చూపి, వైసీపీని ఓడించ‌డానికి ఏక‌మ‌వుతున్నామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. బాబుపై రాళ్ల దాడికి నిర‌స‌నగా జ‌న‌సేన త‌ర‌పున ఏవైనా కార్య‌క్ర‌మాల‌కు పవ‌న్ పిలుపు ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అలాగే చంద్ర‌బాబును నేరుగా క‌లిసి సంఘీభావం ప్ర‌క‌టించే అవ‌కాశాల‌ను కొట్టి పారేయ‌లేం. 

పొత్తుపై చంద్ర‌బాబు నాన్చివేత ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తే… ఓపిక న‌శించి త‌నే 20 సీట్లు చాలంటూ ప్ర‌క‌టించొచ్చు. బాబు, ప‌వ‌న్‌ల‌ను ఏకం చేసేందుకు వైసీపీ స‌ర్కార్ కూడా త‌న వంతు పాత్ర‌ను దిగ్విజ‌యంగా పోషిస్తోంది.