తమిళనాడులో రోజుకు 12 గంటలు పని చేయాలి!

పేరుకు రోజుకు 8 గంట‌ల ప‌ని విధానం అమల్లో ఉన్న‌ ఇప్ప‌టికే చాలా చోట్ల వెట్టి చాకిరి, శ్ర‌మ దోపిడీ య‌థేశ్చ‌గా కొన‌సాగుతోంది. ఇలాంటి స‌మయంలో ప‌ని దినాల్లో ఎలాంటి మార్పులేకుండా ప్రైవేటు సంస్థలు,…

పేరుకు రోజుకు 8 గంట‌ల ప‌ని విధానం అమల్లో ఉన్న‌ ఇప్ప‌టికే చాలా చోట్ల వెట్టి చాకిరి, శ్ర‌మ దోపిడీ య‌థేశ్చ‌గా కొన‌సాగుతోంది. ఇలాంటి స‌మయంలో ప‌ని దినాల్లో ఎలాంటి మార్పులేకుండా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో రోజు 12 గంటలపాటు పనిచేసేలా  త‌మిళ‌నాడు ప్రభుత్వం ఓ బిల్లును శాసనసభలో పెట్టింది. ప్రతిపక్షాలు-అధికార పార్టీల సభ్యుల వ్యతిరేకత మధ్య మూజువాణి ఓటింగ్‌తో బిల్లును ఆమోదించినట్లు సీక్ప‌ర్ ప్రకటించారు.

పనిగంటల పెంపు చట్టం కార్పొరేట్‌ సంస్థలు, కంపెనీలకు మాత్రమే లబ్ధి కలిగిస్తుందని ఆరోపిస్తూ త‌మిళ‌నాడు శాసనసభలో కాంగ్రెస్‌ మినహా డీఎంకే మిత్రపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. ఈ బిల్లుపై పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ… విదేశీ సంస్థలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని, కొత్తగా ఏర్పాటయ్యే కర్మాగారాలు, కంపెనీలలో ఉత్పత్తిని అధికం చేసుకోవడానికి వీలుగా ఈ చట్టాన్ని తీసుకువ‌చ్చామ‌న్నారు. 12 గంటల పని వేళ అనేది పరిశ్రమల యాజమాన్యం, కార్మికుల పరస్పరం అంగీకారం మేరకు అమలు అవుతుందని, ఇందులో బలవంతం లేదని స్పష్టం చేశారు

కాగా ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం వారంలో 4 రోజులు పని.. 3 రోజులు సెల‌వుల‌తో (రోజుకు 8 గంటలకు బదులుగా 12 గంటలు ప‌ని)కొత్త చట్టం తీసుకువచ్చే ఆవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.. కాక‌పోతే త‌మిళ‌నాడు మాత్రం ప‌ని రోజులు త‌గ్గించ‌కుండా రోజు వారి ప‌ని గంట‌లు పెంచ‌డంతో ఉద్యోగుల‌పై మ‌రింత ఒత్తిడి పెరిగే ఆవ‌కాశం ఉందంటూన్నారు కార్మిక సంఘాల నాయకులు.