ప్రభాస్ నుంచి వస్తున్న మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. దర్శకుడు ఓం రౌత్ అందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మీద ఎంత భారీ అంచనాలు వున్నాయో, అంతకు అంతా ట్రోలింగ్ కూడా జరిగింది.
అదంతా భరిస్తూనే, సహిస్తూనే యూనిట్ ముందుకు వెళ్లింది. మార్పులు చేర్పులు ఏం చేసారో, ఏం చేయలేదో అన్నది అఫీషియల్ క్లారిటీ లేదు కానీ, విడుదల తేదీ మాత్రం దగ్గరకు వస్తోంది. దీంతో మెల్లగా ప్రచారం షురూ చేసారు. పోస్టర్లు, స్టిల్స్ వదలుతున్నారు.
లేటెస్ట్ గా ఓ సాంగ్ బిట్ ను కూడా విడుదల చేసారు. జై శ్రీరామ్..జై శ్రీరామ్, రాజారామ్ అంటూ సాగే ఈ పాట మాంచి డివోషనల్ టచ్ తో వుంది. మా నమ్మకం..మా ధైర్యం నీవే రామా అని భక్తులు అనడం కామన్. అదే అర్థాన్ని సాహిత్యంలోకి తీసుకుని పాటను అందించారు. ఇలాంటి డివోషనల్ సాంగ్స్ ను యూత్ కు కూడా నచ్చేలా చేయడంలో పేరున్న సంగీత దర్శకులు అతుల్-అజయ్ ఈ పాటకు ట్యూన్ అందించారు.
అయిదు భాషలకు ఒకే ట్యూన్ చేయించారు. దాంతో తెలుగులో కొన్ని పదాల పలుకుబడి మాత్రం కాస్త కృతకంగా వుంది. అయితే బీట్ మాత్రం బాగుంది. పాటతో పాటు విడుదల చేసిన ప్రభాస్ స్టిల్ ఫ్యాన్స్ కు మాంచి ఊపు ఇస్తోంది. తెలుగులో ఈ సినిమాను యువి సంస్థ అందిస్తోంది.