టీడీపీ బ‌లాన్ని పెంచుతున్న స‌ర్కార్ మీడియా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్షాలు మునుపెన్న‌డూ లేనంత‌గా ఎంతో బ‌ల‌హీనంగా ఉన్నాయి. జ‌గ‌న్ స‌ర్కార్ అనేక ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌కు పాల్ప‌డుతున్నా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌తిప‌క్షాలు ఉద్య‌మించలేని ద‌య‌నీయ స్థితి. అలాంటిది ప్ర‌తిప‌క్షాల బ‌లాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వ అధికార మీడియా…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్షాలు మునుపెన్న‌డూ లేనంత‌గా ఎంతో బ‌ల‌హీనంగా ఉన్నాయి. జ‌గ‌న్ స‌ర్కార్ అనేక ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌కు పాల్ప‌డుతున్నా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌తిప‌క్షాలు ఉద్య‌మించలేని ద‌య‌నీయ స్థితి. అలాంటిది ప్ర‌తిప‌క్షాల బ‌లాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వ అధికార మీడియా సంస్థ సాక్షి పెంచ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఉద్యోగుల ఉద్య‌మాన్ని బ‌ల‌హీన‌ప‌రిచే క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, అలాగే జ‌న‌సేన బ‌లాన్ని పెంచ‌డం ద్వారా త‌ప్పిదానికి పాల్ప‌డింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని ర‌కాల ఉద్యోగులు 13 ల‌క్ష‌ల మంది ఉన్న సంగ‌తి తెలిసిందే. నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ, త‌మ నిర‌సన‌ను తెలియ‌జేయ‌డానికి ఉద్యోగ సంఘాల నేత‌లు ఇటీవ‌ల 3న చ‌లో విజ‌య‌వాడకు పిలుపునిచ్చారు. అస‌లే నూత‌న పీఆర్సీతో త‌మ వేత‌నాలు పెర‌గ‌క‌పోగా, త‌గ్గుతున్నాయ‌నే ఆవేద‌న ప్ర‌తి ఉద్యోగిలో ఉంది. దీంతో బెజ‌వాడ వీధుల్లో క‌దం తొక్కి త‌మ స‌త్తా ఏంటో ప్ర‌భుత్వానికి చూపాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉద్యోగులు వెల్లువ‌లా వ‌చ్చార‌నేది నిజం.

ఈ వాస్త‌వాన్ని దాచి, క్రెడిట్‌ను రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌కు జ‌గ‌న్ ప‌త్రిక ఇవ్వ‌డం వెనుక వ్యూహం ఏంటో అర్థం కావ‌డం లేదు. కానీ ఆ విధంగా జ‌నంలోకి తీసుకెళ్ల‌డం ద్వారా వైసీపీకే రాజ‌కీయంగా న‌ష్ట‌మ‌నే విమ‌ర్శ‌లు సొంత పార్టీ నుంచి రావ‌డం గ‌మ‌నార్హం. పీఆర్సీ సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో గురువారం నిర్వ‌హించిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద ఎత్తున హాజ‌రు కావ‌డంతో పాటు జ‌న స‌మీక‌ర‌ణ కూడా చేసిన‌ట్టు స‌మాచార‌మ‌ని సాక్షి ప‌త్రిక రాసుకొచ్చింది. అందువల్లే ప్ర‌భుత్వంపై, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై రాజ‌కీయ‌, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగిన‌ట్టు ఆ ప‌త్రిక రాయ‌డం విశేషం.  

ఇది ముమ్మాటికీ ఉద్యోగుల ఉద్య‌మాన్ని చుల‌క‌న చేయ‌డ‌మే. త‌న‌కు తానుగా ప్ర‌భుత్వం, అధికార ప‌త్రిక ఆత్మ‌వంచ‌న చేసుకోవ డ‌మే. చ‌లో విజ‌య‌వాడ‌కు భారీగా త‌ర‌లి వ‌చ్చిన ఉద్యోగుల‌ను చూసిన త‌ర్వాతైనా ప్ర‌భుత్వం సానుకూల దృక్ప‌థంతో ఆలోచించి స‌మ‌స్య‌కు చ‌క్క‌టి ప‌రిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఆ విధంగా చేయ‌కుండా ఉద్యోగుల ఉద్య‌మానికి పెడ‌ర్థాలు తీస్తూ, రాజ కీయ కోణంలో విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ల్ల అధికార పార్టీకే న‌ష్టం. ఎందుకంటే ఇప్ప‌టికీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని త‌మ వ్య‌తిరేకుడిగానే ఉద్యోగులు భావిస్తారు.

అలాంటిది అధికార పార్టీ, ప‌త్రికే చొర‌వ తీసుకుని ఉద్యోగుల్ని చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర చేయాల‌నుకోవ‌డం చారిత్ర‌క త‌ప్పిదం కాకుండా మ‌రేమ‌వుతుంద‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఉద్యోగుల్ని దూరం చేసుకోవ‌డంతో పాటు ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌గ్గ‌ర చేసే రాత‌ల‌ను అధికార మీడియా సంస్థ విర‌మించుకుంటే జ‌గ‌న్‌కు ఎంతోకొంత మేలు చేసిన‌ట్టు అవుతుంది. అలా కాకుండా అనాలోచిత రాత‌లు రాస్తే… జ‌గ‌న్ ఖ‌ర్మ అని స‌రిపెట్టుకోవ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగిందేమీ లేద‌ని నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు.