పవన్.. మైలేజీ మిస్సవుతామని భయపడ్డారా?

‘ఛలో విజయవాడ’ పేరుతో ఉద్యోగులు పిలుపు ఇచ్చిన కార్యక్రమం పెద్దఎత్తున సక్సెస్ అయిన తర్వాత.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల ఆందోళనల గురించి సానుభూతి వ్యక్తం చేయడానికి తొలిసారిగా పవన్ కల్యాణ్ కూడా తెరమీదకు వచ్చారు.…

‘ఛలో విజయవాడ’ పేరుతో ఉద్యోగులు పిలుపు ఇచ్చిన కార్యక్రమం పెద్దఎత్తున సక్సెస్ అయిన తర్వాత.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల ఆందోళనల గురించి సానుభూతి వ్యక్తం చేయడానికి తొలిసారిగా పవన్ కల్యాణ్ కూడా తెరమీదకు వచ్చారు. వారికి మద్దతుగా మాట్లాడారు. ఆయన తీరు చూస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిసి ఉద్యమాలు చేస్తున్నప్పుడు.. తాను అలవాటు కొద్దీ.. ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే.. పార్టీకి ఉద్యోగవర్గాల్లో మైలేజీ పోతుందని భయపడి నోరు తెరచినట్లుగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. పవన్ తన వీడియో ప్రకటనలో ఉద్యోగులకు మద్దతు ఇవ్వడం కంటె ఎక్కువగా తాను ఇన్నాళ్లు పాటించిన మౌనం గురించి వివరణ ఇచ్చుకోడానికే సమయం సరిపోయింది. పైగా అనేకానేక ‘కట్’ లతో సాగిన అయిదు నిమిషాల ప్రసంగంలో.. పవన్ కల్యాణ్ తన అనుభవ రాహిత్యంతో దొరికిపోయారు కూడా. రాజకీయ మైలేజీ కోసమే, లక్షల మంది ఒకటే ఉద్యమబాటలో ఉన్నప్పుడు.. వారికి అనుకూలంగా మాట్లాడక పోతే మైలేజీ మిస్సవుతామనే భయంతోనే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టుగా ఆయన బయటపెట్టేశారు. 

పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న ఉద్యోగులు.. తమ పోరాటంలో రాజకీయ పార్టీలను భాగస్వాముల్ని చేయాలని అనుకోవట్లేదని అన్నందువల్లనే దీనిపై మాట్లాడలేదని పవన్ చెప్పారు. వారు తమ వద్దకు వచ్చి అడిగినప్పుడే.. వారికి మద్దతివ్వచ్చునని అనుకున్నాం అన్నారు.

పార్టీ శ్రేణులందరికీ తాను అదే చెప్పానని కూడా అన్నారు. ఈ మాటలోనే పవన్ కల్యాణ్ బుద్ధి బయటపడిపోతోంది. ఎవరెన్ని కష్టాల్లో ఉన్నదా.. తన వద్దకు వచ్చి దేహీ అంటే తప్ప.. వారికి కనీసం మద్దతివ్వడానికి కూడా ఆయన ముందుకు రారు అనే సంగతి తేలిపోతోంది. తమ పోరాటంలో పార్టీలను భాగస్వాముల్ని చేకూడదని మాత్రమే ఉద్యోగులు అన్నారు.. దాని అర్థం.. పార్టీలు మద్దతు ఇవ్వకూడదని కూడా కాదు. 

పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ నాయకులు.. మద్దతు పేరుతో తమ ఉద్యోగుల పోరాటాన్ని.. పార్టీ పోరాటంగా హైజాక్ చేసేస్తారనే భయం వారికి ఉండడం సహజం. అయితే.. ఒక్క జనసేన తప్ప అన్ని పార్టీలూ ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు తెలియజేశాయి. పవన్ కల్యాణ్ మాత్రం.. ఛలో విజయవాడ సక్సెస్- అక్కడకు తరలివచ్చిన ఉద్యోగుల జనప్రవాహాన్ని చూసిన తర్వాత.. ఆ మైలేజీ తమ పార్టీకి మిస్సవుతుందని.. అందరికంటె లేటుగా మద్దతిచ్చి.. అందులోనూ డొంకతిరుగుడు మాటలు వల్లించారు. 

ఇప్పుడు ఉద్యోగులంతా పీఆర్సీ గురించి గగ్గోలు పెడుతోంటే.. పవన్ ప్రత్యేకంగా సీపీఎస్ ప్రస్తావన కూడా తెచ్చారు. సీపీఎస్ రద్దు అనేది జగన్ ను నిందించడానికి ఆయన వాడుకోవచ్చు. కానీ ఆ రద్దు అంత ఈజీ కాదు. వ్యవహారం కేంద్రంతో కూడా ముడిపడి ఉంటుంది. తాను సీపీఎస్ రద్దు చేయిస్తానని, కనీసం సీపీఎస్ రద్దుకు అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మాట్లాడించగలనని పవన్ కల్యాణ్ అనగలరా? ఉత్తినే గుడ్డకాల్చి అధికారంలో ఉన్న వారి మీద వేసేయడం కాదు.. తన మాటలు ప్రాక్టికల్ గా ఉండాలని కూడా పవన్ ఆలోచించాలి.