ఉపాధ్యాయుల‌కు స‌ర్కార్ ఎర‌!

ఉద్యోగుల ఉద్య‌మ బాట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది. నిన్న‌టి చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వ వెన్నులో వ‌ణుకు పుట్టించింది. ఈ ఉద్య‌మంలో ప్ర‌ధానంగా ఉపాధ్యాయులు కీల‌క పాత్ర పోషిస్తుండ‌డంతో స‌మ‌స్య జ‌ఠిల‌మవు తోంద‌ని…

ఉద్యోగుల ఉద్య‌మ బాట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది. నిన్న‌టి చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వ వెన్నులో వ‌ణుకు పుట్టించింది. ఈ ఉద్య‌మంలో ప్ర‌ధానంగా ఉపాధ్యాయులు కీల‌క పాత్ర పోషిస్తుండ‌డంతో స‌మ‌స్య జ‌ఠిల‌మవు తోంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. నూత‌న పీఆర్సీతో ఉద్యోగుల్లో ఎటూ తీవ్ర అసంతృప్తి మిగిల్చామ‌ని, ఏదో ర‌కంగా వారిని చ‌ల్ల‌బ‌రిచేందుకు ఏం చేయాల‌నే విష‌యమై ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఉద్య‌మంలో ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న ఉపాధ్యాయుల‌ను కూల్ చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందులో భాగంగా ఎస్జీటీల‌కు ప్ర‌భుత్వం ప్ర‌మోష‌న్ ఆశ చూపుతోంది. క‌నీసం ఇలాగైనా త‌మ‌పై ఉపాధ్యాయుల కోపాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌నేది ప్ర‌భుత్వ ప్లాన్‌గా క‌నిపిస్తోంది. 

ఇప్ప‌టి వ‌ర‌కూ 19 వేల స్కూళ్ల మ్యాపింగ్ పూర్తైంద‌ని, 22 వేల మందికి పైగా టీచ‌ర్ల‌కు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్ర‌మోష‌న్ క‌ల్పించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ అధికార ప‌త్రిక‌లో బ్యాన‌ర్ క‌థ‌నం రావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అలాగే మ‌రో 17 వేల పాఠ‌శాల్లో విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా టీచ‌ర్ల నియామ కాలు, రేష‌న‌లైజేష‌న్ ద్వారా మ‌రో 8 వేల మందికి ప‌దోన్న‌తులు ల‌భిస్తాయ‌ని రాసుకొచ్చారు. జూన్ నాటికి మొత్తం 30 వేల మంది ఉపాధ్యాయుల‌కు స్కూల్ అసిస్టెంట్లుగా ప‌దోన్న‌తులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ల‌భించ‌నున్నాయ‌నేది శుభ‌వార్త‌. 

అయితే త‌మ‌కు ప్ర‌భుత్వం చేసిన గాయానికి ఇది ఆయింట్‌మెంట్‌గా ఎంత వ‌ర‌కు ప‌ని చేస్తుంద‌నేది ప్ర‌శ్న‌. కానీ ఉపాధ్యాయుల‌కు ప్ర‌భుత్వం ప్ర‌మోష‌న్ అనే ఎర వేస్తోంద‌నేది నిజం. ఈ ఎర‌కు ఉపాధ్యాయులు లొంగిపోయి ఉద్య‌మాన్ని విర‌మిస్తారా? అనేది అనుమాన‌మే.

విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా త‌గిన నిష్ప‌త్తిలో టీచ‌ర్లు ఉండాల‌ని, స‌బ్జెక్టుల వారీగా కూడా ఉపాధ్యాయులు ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌డం వెనుక ఉద్దేశం …ఉపాధ్యాయుల‌ను ఆక‌ట్టుకోవ‌డమే అని చెబుతున్నారు. ఉపాధ్యాయులే ఉద్య‌మంలో పాల్గొన‌క‌పోతే… ఇంత‌టి భారీ స్థాయిలో చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజ‌యవంతం కాద‌నేది ప్ర‌భుత్వ భావ‌న‌. 

అయితే ఉద్యోగుల డిమాండ్ల‌ను వ‌దిలేసి ఇత‌రేత‌ర మార్గాల్లో ఉద్యోగుల స‌మ్మె బాట‌ను అడ్డుకోవ‌డం ప్ర‌భుత్వానికి చేత‌న‌వుతుందా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. దీనికి కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.