‘ఐఆర్ అంటే అప్పు..’ సీఎస్ మరింత రెచ్చగొట్టారా?

అసలే ఏపీలో ఉద్యోగులు మాంచి కాక మీద ఉన్నారు. ఏం సాధించగలరు- అనే విషయం పక్కన పెడితే.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా నియంత్రించాలని చూసినా సక్సెస్ అయిన ఛలో విజయవాడ కార్యక్రమం వారికి మరింత…

అసలే ఏపీలో ఉద్యోగులు మాంచి కాక మీద ఉన్నారు. ఏం సాధించగలరు- అనే విషయం పక్కన పెడితే.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా నియంత్రించాలని చూసినా సక్సెస్ అయిన ఛలో విజయవాడ కార్యక్రమం వారికి మరింత కిక్ ఇచ్చిఉంటుంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. పీఆర్సీ జీవోలు కలిగిస్తున్న ఆందోళన ఒక ఎత్తు.. సమీర్ శర్మ మాటలు ఉద్యోగులకు అవమానకరంగా కూడా ఉన్నాయి. 

చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఆర్థిక శాఖకు చెందిన అధికారులతో కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్లు సహేతుకం కాదని చెప్పడం, వారు ఆందోళన బాటపట్టడం కరెక్టు కాదని విశ్లేషించడం ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లక్ష్యం కావచ్చు. కానీ.. ఆ ప్రెస్ మీట్ లో ఆయన  మాట్లాడిన కొన్ని మాటలు.. ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. 

ప్రధానంగా.. ఐఆర్ అనేది వడ్డీలేని అప్పు మాత్రమే అని సీఎస్ చెప్పడం ఉద్యోగులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పీఆర్సీని సకాలంలో ఏర్పాటుచేసి.. వెంటనే జీతాలు పెంచలేని అశక్త పరిస్థితుల్లో.. కమిషన్ నివేదిక వచ్చేదాకా, దాన్నిఅమల్లోకి తెచ్చేదాకా ఉద్యోగులకు ముందస్తుగా చెల్లించే వేతన భాగానే ఐఆర్‌గా వారంతా భావిస్తూ ఉంటారు. 

ఆ రకంగా ఐఆర్ అనేది తమకు దక్కవలసిన హక్కు అనేది ఉద్యోగ వర్గాల అభిప్రాయం. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచే.. నివేదిక ద్వారా రాగల పెంపు అమల్లోకి వస్తుంది గనుక.. మధ్యలో ఇచ్చే ఐఆర్.. తమకు హక్కుగా దక్కబోయేదే.. కొంత భాగం ముందుగా ఇవ్వడం జరగుతుందనే అంటారు. 

అయితే.. అలాంటి ఐఆర్.. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే వడ్డీలేని అప్పుగా సీఎస్ అభివర్ణించడం ఆగ్రహం కలిగిస్తోంది. అప్పు అనే నిర్వచనం కిందికి తెచ్చారు గనుకనే.. అప్పు వసూలు అనే ఆలోచనతో ‘రికవరీ’ ప్రయత్నాలు ప్రభుత్వం సాగిస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ‘ఐఆర్ అంటే అప్పు’ అనే మాటనే సహించలేకపోతున్నారు. 

సీఎస్ తన ప్రెస్ మీట్ మాటల ద్వారా ఉద్యోగులను రెచ్చగొట్టడం కేవలం ఇదొక్క మాటతోనే కాదు. ఇంకొన్ని మాటలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు చర్చలకు రావాలని పదేపదే ఆహ్వానించిన సీఎస్ సమీర్ శర్మ.. ‘సమ్మెకు వెళ్తే ఏమైనా జరగొచ్చు. బయటి శక్తులు వచ్చి ఏం చేస్తాయో చెప్పలేం’ అని అనడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎస్ మాటలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఆగ్రహిస్తున్నారు. శాంతియుతంగా సమ్మెలో ఉండే ఉద్యోగులను ‘ఏమైనా చేయాలని’ బయటి వ్యక్తులను పురిగొల్పుతున్నట్లుగా సీఎస్ మాటలు ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

ఐఆర్ మొత్తాల నుంచి రికవరీ ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘సామాన్యుడి భాషలో రికవరీ అనొచ్చు. ప్రభుత్వం రికవరీ చేయదు. సర్దుబాటు చేస్తుంది’ అంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారి శశిభూషణ్ అనడం కూడా ఉద్యోగులకు కోపం తెప్పిస్తోంది. ఒక వైపు చలో విజయవాడ సక్సెస్ తో ఉద్యోగవర్గాలు మరింత బలం కూడగట్టుకుంటుండగా.. ఉన్నతాధికారుల ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఎటు దారితీస్తాయో చెప్పలేం.