బిజెపిలోకి వెళ్లకుండా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్!

తెలంగాణ కాంగ్రెస్ మీద అసంతృప్తితో రగులుతున్న తెలంగాణ నాయకులు, బిజెపిలోకి మాత్రం వెళ్లకుండా ఉండేందుకు ఆ పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో తమ ముద్ర చూపించాలనే కోరిక ఉన్నంత వరకు,…

తెలంగాణ కాంగ్రెస్ మీద అసంతృప్తితో రగులుతున్న తెలంగాణ నాయకులు, బిజెపిలోకి మాత్రం వెళ్లకుండా ఉండేందుకు ఆ పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో తమ ముద్ర చూపించాలనే కోరిక ఉన్నంత వరకు, బిజెపిలోకి వెళ్లడం వల్ల ఉపయోగం లేదని.. అసంతృప్త నాయకులకు థర్డ్ పార్టీ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. 

నేరుగా పార్టీ నాయకులు చేస్తున్న రాజీ చర్చలు, బుజ్జగింపుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండడంలేదు. ఆ నేపథ్యంలో.. అసంతృప్తితో బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్న వారిని నియంత్రించడానికి కాంగ్రెస్ కొత్త వ్యూహం అనుసరిస్తోంది. వారి సన్నిహితుల ద్వారా హితోపదేశాలు చేయించే ప్రయత్నంలో ఉంది.

సాధారణంగా ఒక పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వారు ఇంకో పార్టీని ఎంచుకుని వలస వెళ్లిపోతారు. కాంగ్రెసులో ఇలా టికెట్ రాని వారందరికీ ప్రస్తుతానికి ఏకైక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉన్నది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ఆల్రెడీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా వలసలకు తలుపులు మూసేసినట్లే లెక్క! 

ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా పర్వాలేదు బారాస అండలో ఉండి, ఏదో ఒక పదవి దక్కించుకుందాం అనుకునేవారు తప్ప ఇతరులు ఎవరూ ఇప్పుడు అందులోకి వలస వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాకు తుది రూపం ఇస్తూ ఉన్నది.

అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ పార్టీ నాయకులకు సంకేతమాత్రంగా ఏ స్థానం నుంచి ఎవరికి అభ్యర్థిత్వం దక్కబోతున్నదో  తెలుస్తూనే ఉన్నది. టికెట్ దక్కక అసంతృప్తితో రగులుతున్న నాయకులు కాంగ్రెస్ ను వీడి బిజెపిలోకి వెళ్లడానికి సమాయత్తం అవుతున్నారు.

వీరిని బుజ్జగించడానికి ఒకవైపు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బుజ్జగింపులు పనిచేయకపోతే వారి సన్నిహితుల ద్వారా మైండ్ గేమ్ ఆడడానికి చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లో బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అలాంటి పార్టీని నమ్ముకొని వెళ్లడానికంటే, కాంగ్రెస్లో ఉండి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విజయం సాధించడానికి ఉపయోగపడితే గనుక ఎమ్మెల్సీలు ఇతర నామినేటెడ్ పోస్టులు అన్ని వారికే దక్కుతాయనే ప్రచారం తీసుకు వెళుతున్నారు.

భారతీయ జనతా పార్టీ మహా అయితే కేంద్రంలో అధికారంలోకి రావచ్చుగాని, తెలంగాణ రాష్ట్రంలో వారి చరిష్మా వర్కౌట్ కాదని సంకేతాలు పంపుతున్నారు. కేంద్ర రాజకీయాల మీద ఆసక్తి ఉండేవాళ్ళు వెళితే వెళ్ళవచ్చు కానీ, రాష్ట్ర రాజకీయాల్లోనే తమ భవిష్యత్తును చూసుకోవాలి అనుకునేవారు వెళ్లడం వారికే శ్రేయస్కరం కాదని అసంతృప్త నాయకుల సన్నిహితుల ద్వారా హితోపదేశం చేయిస్తున్నారు.

కేవలం బుజ్జగింపులు, రాజీ చర్చలు ఫలించవు అనే సంగతి పార్టీకి అర్థమైంది. కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ రాజీనామా చేయకుండా చూడడానికి రాష్ట్ర పార్టీ నాయకులు బృందం ఇంటికి వెళ్లి మాట్లాడింది. రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. మాణిక్ రావు ఠాక్రే, మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడారు. చివరికి రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఆయన రాజీనామా లేఖ  ఇచ్చేశారు. 

ఇలాంటి పరిస్థితుల్లో బిజెపితో భవిష్యత్తు ఉండదు అనే ప్రచారం మాత్రమే అసంతృప్తులను ఆపగలుగుతుందనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుగా కనిపిస్తోంది.