ఫలిస్తున్న నిరీక్షణ వ్యూహం!

భారతీయ జనతా పార్టీ ఏదో మొక్కుబడిగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తులను స్వీకరించినప్పటికీ.. వాటిని పరిశీలించి అభ్యర్థుల తుది జాబితాలను తయారు చేయడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఆ పర్వాన్ని నెమ్మది నెమ్మదిగా…

భారతీయ జనతా పార్టీ ఏదో మొక్కుబడిగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తులను స్వీకరించినప్పటికీ.. వాటిని పరిశీలించి అభ్యర్థుల తుది జాబితాలను తయారు చేయడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఆ పర్వాన్ని నెమ్మది నెమ్మదిగా వాయిదా వేసుకుంటూ పోతూనే ఉన్నారు. 

అభ్యర్థుల జాబితాలు తేల్చడం పట్ల బిజెపి ఆలోచన ఒక్కటే. ఈ జాబితాలు తేల్చడం అనే పని ఇతర పార్టీలు పూర్తి చేస్తే కనుక.. ఆ పార్టీలోని అసంతృప్తులకు తాయిలాలు ప్రకటించి, ఎరవేసి తమ పార్టీలోకి లాక్కోవచ్చునని ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.

ఆ పార్టీ అనుసరిస్తున్న నిరీక్షణ వ్యూహమే ఇప్పుడు ఫలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మేడ్చల్, మెదక్ జిల్లాలో డిసిసి అధ్యక్షులు ఇప్పుడు కమలం గూటికి చేరబోతున్నారు. ఇద్దరు కూడా ఆ పార్టీలో వారి వారి నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి అర్హులుగా ముందు వరుసలో చలామణిలో ఉన్న వారే కావడం విశేషం. 

మైనంపల్లి కుటుంబం భారత రాష్ట్ర సమితిని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరిన పర్యవసానంగా ఈ ఇద్దరు డిసిసి అధ్యక్షులు కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. టికెట్ దక్కకుండా తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్న ఆ ఇద్దరు నాయకులు కేవలం అభ్యర్థిత్వం మీది ఆశతో భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించబోతున్నారు. 

మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మల్కాజ్ గిరి టికెట్ ఆశించారు. మైనంపల్లి హన్మంతరావు రాకతో ఆ ఆశ ఉడిగిపోయింది. అలాగే మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కూడా మెదక్ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ వచ్చారు. మైనంపల్లి కొడుకుకు అక్కడ టికెట్ ఇస్తారని తెలిశాక, ఆయన కూడా రాజీనామా చేసి బిజెపి తరఫున పోటీచేయాలనుకుంటున్నారు.

స్పష్టంగా చెప్పాలంటే ఇలాంటి అసంతృప్తులు, తిరుగుబాటు నాయకులు ఇంకా పెద్ద సంఖ్యలో తమ పార్టీలోకి వస్తారని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నది. సిద్ధాంతాలు, భావజాల సారూప్యత వంటి అంశాలను ఏనాడో మరిచిపోయిన ఆ పార్టీ.. ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు వచ్చినా సరే తక్షణం రెడ్ కార్పెట్ వేసి స్వాగతించి తమ పార్టీలో అగ్రపూజలు అందించే వాతావరణం ప్రస్తుతం ఉంది. 

రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు తామే ప్రత్యామ్నాయమని, తాము అధికారంలోకి వచ్చి తీరుతామని ప్రగల్భాలు పలుకుతున్న బిజెపి.. కనీసం 119 స్థానాలకు ఏకబిగిన అభ్యర్థులను ఎంపిక చేయగల సామర్థ్యంతో కూడా లేదనేది అందరికీ తెలిసిన సంగతి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇతర పార్టీలు టికెట్లను ధ్రువీకరించిన తర్వాత ఆయా పార్టీల నుంచి బయటకు రాగల వలస నాయకుల మీద ఆశలు పెట్టుకొని బిజెపి బతికీడుస్తున్నది.

తెలంగాణలో అమిత్ షా ఈనెల పదోతేదీన మరో బహిరంగ సభకు కూడా సిద్ధమవుతున్నారు గానీ.. అభ్యర్థుల జాబితా మాత్రం బిజెపి తేల్చడం లేదు. కాంగ్రెస్ జాబితా కూడా వచ్చేసిన తర్వాత.. ఇంకా అక్కడా ఇక్కడా మిగిలిన ఆ పార్టీల్లోని అసంతృప్త నాయకులందరికీ గేలం వేసి, నిదానంగా తమ జాబితాను రూపొందించే అవకాశమే కనిపిస్తోంది.