అహంకారంతో కాదు… జ‌గ‌న్‌కు హితవు!

చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి ఉద్యోగులు పోటెత్త‌డం ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌ర‌మే. ఇదే స‌మ‌యంలో ఉద్యోగుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. మొద‌టి నుంచి చంద్ర‌బాబు ఉద్యోగుల వ్య‌తిరేకిగా…

చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి ఉద్యోగులు పోటెత్త‌డం ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌ర‌మే. ఇదే స‌మ‌యంలో ఉద్యోగుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. మొద‌టి నుంచి చంద్ర‌బాబు ఉద్యోగుల వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డ్డారు. త‌న‌పై వ్య‌తిరేక‌త‌ను పోగొట్టుకునేందుకు ఇంత‌కంటే మంచి త‌రుణం లేద‌ని చంద్ర‌బాబు ఉత్సాహం చూపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇవాళ చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని అవ‌కాశంగా తీసుకోవాల‌ని చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా మాట్లాడారు. ఉద్యోగుల‌ను ఉగ్ర‌వాదుల్లా అరెస్ట్ చేస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిర‌స‌న‌ల‌పై ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు దుర్మార్గ‌మ‌ని ఆయ‌న మండిపడ్డారు.

విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం విశేషం. కొత్త పీఆర్సీ జీవోలను వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని ప్ర‌భుత్వానికి చంద్రబాబు  హిత‌వు చెప్పారు.

ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగుల‌కు లేదా? అని గొప్ప ప్ర‌జాస్వామిక‌వాది అయిన చంద్ర‌బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని చంద్ర‌బాబు నిలదీయ‌డం విశేషం. మాయ మాటలతో వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చార‌ని విమ‌ర్శించారు. 

ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని విరుచుకుప‌డ్డారు. నియంతృత్వం వీడి రివ‌ర్స్ పీఆర్సీని వెన‌క్కి తీసుకోవాల‌ని బాబు డిమాండ్ చేశారు.