పాడిందే పాడ‌రా పాచిప‌ళ్ల దాస‌రా!

పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా అనే సామెత చందాన ఏపీ మంత్రుల మాట‌లున్నాయి. ఉద్యోగుల‌తో త‌లెత్తిన వివాదాన్ని సున్నితంగా ప‌రిష్క‌రించుకోవాల్సింది పోయి … వారిని రెచ్చ‌గొట్టేలా మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఉద్యోగుల్ని బ‌య‌టి వ్య‌క్తులు…

పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా అనే సామెత చందాన ఏపీ మంత్రుల మాట‌లున్నాయి. ఉద్యోగుల‌తో త‌లెత్తిన వివాదాన్ని సున్నితంగా ప‌రిష్క‌రించుకోవాల్సింది పోయి … వారిని రెచ్చ‌గొట్టేలా మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఉద్యోగుల్ని బ‌య‌టి వ్య‌క్తులు స‌వాల‌క్ష ర‌కాలుగా విమ‌ర్శించొచ్చు. వాటిని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. కానీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములైన వారు జాగ్ర‌త్త‌గా నోరు తెర‌వాల్సి వుంటుంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ విష‌యంలో అలాంటి బాధ్య‌త వున్నట్టు క‌నిపించ‌డం లేదు.

ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా రోడ్డెక్కిన ఉద్యోగుల‌పై ప్ర‌త్య‌ర్థుల్లా మంత్రులు విమ‌ర్శ‌లు, వెట‌కారాలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌నిలో విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ కాస్త ముందంజ‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. చ‌లో విజ‌య‌వాడ‌కు భారీగా త‌ర‌లి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఉద్యోగుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం మంత్రుల‌కే చెల్లింది.

సీఎం స‌మ‌క్షంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని ఉద్యోగ సంఘాలు గౌర‌వించాల‌ని మ‌రోసారి ఆదిమూల‌పు సురేష్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇదే వాద‌న‌ను గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే చ‌ర్చ‌ల‌కు రావాల‌ని, ఎవ‌రినీ ఇబ్బంది పెట్ట‌కుండా ఉద్యోగులు స‌హ‌కరించాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌భుత్వంలో ఉద్యోగులు ఓ భాగ‌మ‌ని ఆయ‌న తేనెలొలికే మాట‌లు చెప్పుకొచ్చారు. ఉద్యోగ సంఘాలు ఓట్ల గురించి కాదు.. సమస్య గురించి మాట్లాడాలని మంత్రి హితవు పలికారు.

ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల క‌మిటీలోని స‌భ్యుడైన మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. జీతాలు ప్రాసెస్‌ చేశాక ఆపమని చెప్పడం భావ్యం కాదన్నారు. పీఆర్సీ అమలులో సమస్యలుంటే చర్చిస్తామని తెలిపారు. ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉద్యోగులకు చంద్రబాబు కంటే ఎక్కువగానే మేలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

మ‌రో మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చ‌ర్చ‌ల ద్వారానే ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిం చుకోవాల‌ని సూచించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఉద్యోగులు వచ్చి చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. చిన్న సమస్యను ఉద్యోగులు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని మంత్రి బాలినేని హిత‌వు ప‌లికారు.

ఇలా ప్ర‌భుత్వంలోని ప్ర‌తి ఒక్క‌రూ ఉద్యోగులు చ‌ర్చించాల‌ని, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని చెప్పేవాళ్లు. ప్ర‌ధానంగా ఉద్యోగుల మూడు డిమాండ్ల‌పై ప్ర‌భుత్వం స‌సేమిరా అన‌డంతోనే స‌మ‌స్య జ‌ఠిల‌మైంది. ఉద్యోగులు ప్ర‌స్తావిస్తున్న అంశాల‌పై కేవ‌లం చ‌ర్చించిన మాత్రాన ప్ర‌యోజ‌నం వుండ‌దు. వాటిపై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తేనే ఫ‌లితం వుంటుంది. 

ప‌దేప‌దే చ‌ర్చ‌ల అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో ప్ర‌భుత్వ ఉద్దేశం ఏంటో అర్థం కావ‌డం లేదు. కానీ ఇలా చ‌ర్చ‌ల పేరుతో కాల‌యాప‌న చేస్తే …కొత్త స‌మ‌స్య‌లు పుట్టుకు రావ‌డం త‌ప్పితే ప్ర‌యోజ‌నం వుండ‌దు. ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వానికి అంత మంచిది కూడా కాదు. ఎందుకంటే ఐదేళ్ల‌కోసారి ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని పాల‌కులు మ‌రిచిపోవ‌డం, ప్ర‌తిప‌క్షంలోకి రాగానే క‌ళ్లు తెర‌వ‌డం చూస్తూనే వున్నాం. 

క‌ళ్లెదుటే చంద్ర‌బాబును నిలువెత్తు నిద‌ర్శ‌నం పెట్టుకుని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తుండ డం వైసీపీ శ్రేణుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది.