రాజ్యాంగేత‌ర శ‌క్తితో చ‌ర్చ‌లేంటి?

ఉద్యోగుల ప్ర‌ధాన టార్గెట్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అయ్యారు. త‌మ క‌డుపు కొట్ట‌డానికి స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి ఎవ‌రంటూ ఉద్యోగులు నిల‌దీస్తున్నారు. ఇవాళ చ‌లో విజ‌య‌వాడ పిలుపునందుకుని రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి ఉద్యోగులు…

ఉద్యోగుల ప్ర‌ధాన టార్గెట్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అయ్యారు. త‌మ క‌డుపు కొట్ట‌డానికి స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి ఎవ‌రంటూ ఉద్యోగులు నిల‌దీస్తున్నారు. ఇవాళ చ‌లో విజ‌య‌వాడ పిలుపునందుకుని రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి ఉద్యోగులు వేలాది బెజ‌వాడ‌కు త‌ర‌లి వెళ్లారు. 

బెజ‌వాడ‌లో ఎక్క‌డ చూసినా ఉద్యోగులే. ర్యాలీగా వెళుతూ త‌మ నిర‌స‌న‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేశారు. ప్ర‌తి అంశంపై మాట్లాడ్డానికి తానున్నానంటూ మీడియా ముందుకొచ్చే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నార‌నేందుకు ఇవాళ వారి విమ‌ర్శ‌లే నిద‌ర్శ‌నం.

చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ తమ శ్ర‌మ‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి దోచుకున్నార‌ని ఆరోపించారు. అస‌లు ఆయ‌న‌కు, పీఆర్సీకి సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగ సంఘాల నేత‌లు రాజ్యాంగేత‌ర శ‌క్తి అయిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం చారిత్ర‌క త‌ప్పిదంగా ఉద్యోగులు అభివ‌ర్ణించారు. త‌మ‌కు స‌ల‌హాదారుల పాల‌న వ‌ద్ద‌ని, ఎన్నుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని నిన‌దించ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌భుత్వానికి స‌ల‌హాలివ్వ‌డ‌మే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప‌ని అన్నారు. కానీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎవ‌ర‌ని ఉద్యోగులు నిల‌దీయడం ద్వారా… వారెంత‌గా ర‌గిలిపోతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. త‌మ‌కు హామీలిచ్చిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌మ ఓట్ల‌తో గెలిచి, చివ‌రికి త‌మ‌నే మోసం చేశార‌ని సీఎంపై ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.