జ‌గ‌న్ స‌ర్కార్‌కు హ్యాండిచ్చిన పోలీసులు!

నూత‌న పీఆర్సీతో త‌మ జీతం పెర‌గ‌క‌పోగా, త‌గ్గింద‌నే బాధ‌, ఆవేద‌న ప్ర‌తి ఉద్యోగిలో ఉంది. జ‌గ‌న్ స‌ర్కార్ ఉద్యోగ వ్య‌తిరేక విధానాల‌పై వారంతా ర‌గిలిపోతున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే క‌సి తీర్చుకోవాల‌నేంత ఆగ్ర‌హంతో ఉద్యోగులు…

నూత‌న పీఆర్సీతో త‌మ జీతం పెర‌గ‌క‌పోగా, త‌గ్గింద‌నే బాధ‌, ఆవేద‌న ప్ర‌తి ఉద్యోగిలో ఉంది. జ‌గ‌న్ స‌ర్కార్ ఉద్యోగ వ్య‌తిరేక విధానాల‌పై వారంతా ర‌గిలిపోతున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే క‌సి తీర్చుకోవాల‌నేంత ఆగ్ర‌హంతో ఉద్యోగులు ఊగిపోతున్నారు. మ‌రోవైపు ఉద్యోగులు చేప‌ట్టిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం అద్భుత‌హః అనేంత‌గా విజ‌య‌వంతంగా న‌డుస్తోంది.  

ఎటూ ఈ నెల 6వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకోవాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌ల్ని మంత్రుల క‌మిటీ కోరుతూ వ‌చ్చింది. అయితే త‌మ డిమాండ్ల‌పై సానుకూలంగా స్పందించ‌ని కార‌ణంగా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఎలాగైనా ఉద్యోగుల చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవాల‌ని ప్ర‌భుత్వం గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేత‌ల్ని ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు నిర్బంధించార‌నే వార్త‌లొచ్చాయి. అయితే క్షేత్ర‌స్థాయిలో అస‌లు విష‌యం వేరేలా ఉంది. నూత‌న పీఆర్సీతో తాము కూడా న‌ష్ట‌పోయామ‌ని, అందువ‌ల్ల ఉద్యోగుల ఆందోళ‌న‌ల‌పై చూసీచూడ‌న‌ట్టుగా క‌న్నేయాల‌ని పోలీసులు నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. అందువ‌ల్లే అక్క‌డ‌క్క‌డ మిన‌హాయిస్తే ఉద్యోగుల‌ను విజ‌య‌వాడ వెళ్ల‌కుండా పోలీసులు ఉద్దేశ పూర్వ‌కంగా అడ్డుకోలేదని స‌మాచారం.

నిజంగా పోలీసులే అనుకుని వుంటే భారీ స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చ‌లో విజ‌య‌వాడ‌కు వెళ్లే వాళ్లు కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంచ‌నాల‌కు మించి విజ‌య‌వాడ‌కు ఉద్యోగులు వెళ్ల‌డంతో ఇక చేసేదేమీ లేక పోలీసులు చేతులెత్తేశారు. బారికేడ్ల‌ను పోలీసులే తొల‌గించి ఉద్య‌మ‌బాట ప‌ట్టాల‌ని ప్రోత్స‌హించ‌డం గ‌మ‌నార్హం. 

ఇప్ప‌టికీ త‌మ‌కు వేత‌నం ప‌డ‌లేద‌ని, అలాగే హెచ్ఆర్ఏ త‌గ్గించ‌డం , ఇత‌ర‌త్రా బెన్‌ఫిట్స్‌ను ప్ర‌భుత్వం తొల‌గించ‌డంపై పోలీసులు సైతం ఆగ్ర‌హంగా ఉన్నారు. ఇక మీద‌ట ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు అడ్డ‌మైన ప‌నులు చేసేందుకు సుముఖంగా లేమ‌ని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్ర‌భుత్వ అనాలోచిత చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌తిరేకం అవుతున్నార‌నేది వాస్త‌వం. దీనికి ప‌రిష్కారం ఏంటో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కే తెలియాలి.