ఏపీ స‌ర్కార్ గుండెల‌దిరేలా…

ముందే హెచ్చ‌రించిన‌ట్టుగానే ఉద్యోగులు త‌మ స‌త్తా ఏంటో ఏపీ స‌ర్కార్‌కు చూపారు. చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వేలాదిగా ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు త‌ర‌లి వెళ్లారు. పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ ఎక్క‌డెక్క‌డి…

ముందే హెచ్చ‌రించిన‌ట్టుగానే ఉద్యోగులు త‌మ స‌త్తా ఏంటో ఏపీ స‌ర్కార్‌కు చూపారు. చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వేలాదిగా ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు త‌ర‌లి వెళ్లారు. పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ ఎక్క‌డెక్క‌డి నుంచి వ‌చ్చిన ఉద్యోగుల‌తో బెజ‌వాడ జ‌న‌సంద్రాన్ని త‌ల‌పించింది. బెజ‌వాడ వీధుల‌న్నీ ఇసుకేస్తే రాల‌నంత‌గా జ‌నంతో కిక్కిరిశాయి. ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిన‌దించారు.

నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ పీఆర్సీ సాధ‌న స‌మితి చ‌లో విజ‌య‌వాడ‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ఉద్యోగులు, ఉపాధ్యా యులు, కార్మికులు స్వ‌చ్ఛందంగా విజ‌య‌వాడ‌కు త‌ర‌లి వెళ్లారు. పోలీసుల క‌ళ్లుగ‌ప్పి వారంతా న‌గ‌రానికి చేరుకోవ‌డం విశేషం.  ఎన్జీవో హోం నుంచి అలంకార్ థియేట‌ర్ మీదుగా బీఆర్‌టీఎస్ కూడ‌లి వ‌ర‌కు భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.  

జ‌గ‌న్ స‌ర్కార్ ఉద్యోగుల వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ, బెజ‌వాడ వీధుల్లో వారంతా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిన‌దించ‌డం గ‌మ‌నార్హం. పీఆర్సీ జీవోల‌న్నీ ర‌ద్దు చేసే వ‌ర‌కూ ఉద్య‌మాన్ని విర‌మించేది లేద‌ని ఉద్యోగులు తేల్చి చెప్పారు. అర్ధ‌రాత్రి ఇచ్చిన చీక‌టి జీవోల‌ను ర‌ద్దు చేయాలంటూ ఉద్యోగులు నిన‌దించారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్ర‌భుత్వ‌మంటూ త‌మ‌ను రోడ్డు మీద‌కి లాగార‌ని ఉద్యోగులు మండిప‌డ్డారు.

పీఆర్సీ జీవోల‌ను ర‌ద్దు చేసే వ‌ర‌కూ త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని ఉద్యోగులు శ‌ప‌థం చేశారు. రాష్ట్రంలోని న‌లుమూల‌ల నుంచి వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన ఉద్యోగుల ఆందోళ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేయాల‌ని నాయ‌కులు డిమాండ్ చేశారు. 

స‌ల‌హాదారుల పాల‌న త‌మ‌కొద్ద‌ని, సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా చొర‌వ చూపి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌లో ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా మొద‌టిసారిగా భారీ స్థాయిలో ఉద్య‌మించ‌డం ఇదే మొద‌టిసారి. మొత్తానికి ఉద్యోగుల నినాదం ప్ర‌భుత్వ గుండెల‌దిరేలా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.