ఏ ఎమ్మెల్యే అనని మాటలు…షాకిచ్చేశారా.. ?

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ఇప్పటి దాకా ఏ ఎమ్మెల్యే అనని మాటలు చటుక్కున అనేశారు. అనకాపల్లి అభివృద్ధి కోసం ఎవరి కాళ్ళు అయినా పట్టుకుంటాను అని చాలా…

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ఇప్పటి దాకా ఏ ఎమ్మెల్యే అనని మాటలు చటుక్కున అనేశారు. అనకాపల్లి అభివృద్ధి కోసం ఎవరి కాళ్ళు అయినా పట్టుకుంటాను అని చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశారు. ఆయన విసిగి వేసారి అన్నారా లేక ప్రగతిని గట్టిగా కోరుకుని ఇలా బోల్డ్ గా మాట్లాడారా అన్నది పక్కన పెడితే ఒక విధంగా యువ ఎమ్మెల్యేలో తీరని ఆవేదన ఉందని అర్ధమవుతోంది.

ఇంతకీ ఆయన ఎందుకులా రియాక్ట్ కావాల్సి వచ్చింది అంటే కధ చాలానే ఉంది మరి. అనకాపల్లికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. అయిదు వందల కోట్లతో దాన్ని నిర్మాణానికి కూడా గత ఏడాది శ్రీకారం చుట్టారు. అయితే దానికి కేటాయించిన స్థలం మీద వివాదం పేరిట కొందరు కోర్టుకు వెళ్లారు.

అక్కడ మెడికల్ కాలేజి వద్దు అంటూ టెక్నికల్ రీజన్స్ చూపించి స్టే తీసుకువచ్చారు. దీంతో అది అలా ఆగిపోయింది. దాంతో గుడివాడ బాగా కలత చెందారు. అనకాపల్లిని సర్కార్ అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే ఇలా అడ్డుకోవడమేంటి అంటూ ఒకింత ఆవేదంతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అనకాపల్లికి అభివృద్ధి చేస్తే అది భావి తరాల కోసమే తప్ప నాకు కానీ జగన్ కి కానీ పేరు కోసం కానే కాదు మహా ప్రభో అని మొరపెట్టుకున్నారు. దీన్ని అర్ధం చేసుకోండి. మన ముందు తరాలు బాగుపడాలీ అంటే మెడికల్ కాలేజీ కావాలి. దయచేసి దాన్ని అడ్డుకోవద్దు, అవసరం అయితే మీ అందరి కాళ్ళూ పట్టుకుంటాను అని కూడా అంటున్నారు.

మరి ఈ యువ ఎమ్మెల్యే అభ్యర్ధనను కోర్టు పక్షులు అర్ధం చేసుకుంటాయా. ఏదో ఒక కారణం చూపించి కోర్టులకు వెళ్ళి అక్కడ పని జరగకుండా ఆపించడమే కొందరు చేస్తున్న తెలివైన రాజకీయం. మరి అది ఫక్తు పాలిటిక్స్ అయినపుడు కాళ్ళు పట్టుకున్నా చేయి పట్టుకుని బతిమాలినా దారికి వస్తారా. మొత్తానికి ఎమ్మెల్యే కామెంట్స్ అయితే జనాల్లో చర్చకు వస్తున్నాయి. జనాలు మారితేనే ఇలాంటి అడ్డుపుల్లలకూ బ్రేకులు పడతాయి అని ఆశపడాలేమో.