వైసీపీలో విజయసాయిరెడ్డి కీలక నేత. రెండోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది డిసెంబర్ మూడో వారం తర్వాత ఆయనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అయితే ఆ మార్పు మంచికే అని మెజార్టీ అభిప్రాయం. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాత్రం విజయసాయిరెడ్డి సంస్కారం మరోలా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తోందని తెలుసుకుని విజయసాయిరెడ్డిలో భయంతో కూడిన మార్పు వచ్చిందనడం చర్చనీయాంశమైంది.
గతంలో చంద్రబాబునాయుడు, లోకేశ్‌లపై విజయసాయిరెడ్డి ఇష్టానుసారం చెలరేగిపోయేవారు. అలాగే ఈనాడు మీడియా అధినేత రామోజీరావుపై కూడా అభ్యంతరకర పోస్టులు పెట్టేవారు. అయితే విజయసాయిరెడ్డి గురించి …గత ఏడాది డిసెంబర్‌కు ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకోవాల్సి వుంటుంది. పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి అందుకు తగ్గట్టుగా హూం దాగా ట్వీట్లు, విమర్శలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు అన్ని పక్షాల నుంచి వ్యక్తమయ్యేయి.
విజయసాయిరెడ్డి ఎందుకనో ఒక్కసారిగా బుద్ధుడిలా మారిపోయారు. ఇతరుల గురించి ఒక్క మాట కూడా నోరు జారడం లేదు. తాజాగా చంద్రబాబుకు శుభాకాంక్షల్ని కూడా చాలా గౌరవంగా, అభిమానంగా చెప్పడం టీడీపీ నేతలు, శ్రేణుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్పందిస్తూ… ప్రజల్లో మార్పు చూసి గతంలో అడ్డగోలు విమర్శలు చేసిన వాళ్లలో ఇప్పుడు భయంతో కూడిన మార్పు కనిపిస్తోందన్నారు.
నిజానికి విజయసాయిరెడ్డి టీడీపీ అధినాయకుడు చంద్రబాబుతో గత కొంత కాలంగా వ్యవహరిస్తున్న తీరు వైసీపీ పెద్దలకు కోపం తెప్పిస్తోంది. గుండెపోటుతో తారకరత్న మృతి చెందడం, ఆయన అంత్యక్రియల సందర్భంలో బాబుతో రాసుకునిపూసుకుని విజయసాయిరెడ్డి తిరగడాన్ని సొంత పార్టీ వాళ్లలో కొందరు జీర్ణించుకోలేకపోయారు. అంతిమంగా వైఎస్ జగన్ ఏం ఆలోచిస్తున్నారనే దానిపైన్నే విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్ ఆధారపడి వుంటుంది.
ఇప్పటి వరకైతే విజయసాయిరెడ్డిపై జగన్ సదభిప్రాయంతోనే ఉన్నారని సమాచారం. విజయసాయిరెడ్డిలో వచ్చిన మార్పును కూడా అచ్చెన్నాయుడు స్వాగతించడానికి బదులు, రాజకీయ కోణంలో చూడడమే విచిత్రంగా వుంది.
గతంలో వైఎస్ జగన్‌ను దూషించిన వాళ్లంతా టీడీపీని, రాష్ట్రాన్ని వదిలి పెట్టిన వైనం బహుశా అచ్చెన్నకు గుర్తొచ్చి వుంటుందేమో! బాబును మర్యాదగా మాట్లాడితే కూడా తప్పనే రీతిలో అచ్చెన్న వ్యాఖ్యలున్నాయి. అంటే బాబును నిత్యం తిడితే, అప్పుడు వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు పంపాలని అధికార పార్టీకి ఆయన సూచిస్తున్నారా?