ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కుంభకోణంలో టీచర్స్ ఎమ్మెల్సీ షాక్ సాబ్జీ టీటీడీ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. ఈ విషయం సంచలనం రేకెత్తిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ తరపున షేక్ సాబ్జీ రెండేళ్ల క్రితం గెలుపొందారు.
ఇదిలా ఉండగా బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్న విషయాన్ని ఇవాళ టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆయనపై కేసు నమోదుకు సిద్ధమయ్యారు. ఈ నెలలో 19 సిఫార్సు లేఖలను ఎమ్మెల్సీ పంపగా, టీటీడీ పరిగణలోకి తీసుకుని బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించింది. ఇవాళ ఏకంగా 14 మంది భక్తులను వెంటబెట్టుకుని ఆయన తిరుమల దర్శనానికి వెళ్లారు. అలాగే ఇదే నెలలో ఆయన మూడు సార్లు తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
ఈయన పదేపదే దర్శనం చేసుకోవడంతో టీటీడీ విజిలెన్స్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన సిఫార్సు చేసిన భక్తులకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ నిఘా పెట్టింది. ఇవాళ 14 మంది భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించారు. తామంతా కర్నాటక వాసులుగా చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వారిగా ఆధార్‌లో ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాకు రూ.1.05 లక్షలను భక్తులు బదిలీ చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
దీంతో బ్రేక్ దర్శనాల అమ్మకానికి ఎమ్మెల్సీ పాల్పడుతున్నట్టు టీటీడీ విజిలెన్స్ తేల్చింది. ఇది తీవ్రమైన నేరంగా భావించిన టీటీడీ కేసు నమోదుకు చర్యలు చేపట్టింది. టీటీడీలో దళారుల ఏరివేత చర్యలు ముమ్మరం చేశామని, టికెట్ల అమ్మకానికి పాల్పడే వ్యక్తులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఈవో ధర్మారెడ్డి హెచ్చరించారు. ఇందుకు ఎమ్మెల్సీపై కేసు నమోదే ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు.