లోకేశ్ అడుగులు…ల‌క్ష్యం దిశ‌గా ప‌డుతున్నాయా?

టీడీపీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా నారా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న కుప్పంలో లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర మొద‌టి అడుగు ప‌డింది. నాలుగు వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర…

టీడీపీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా నారా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న కుప్పంలో లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర మొద‌టి అడుగు ప‌డింది. నాలుగు వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర ల‌క్ష్యం. శుక్రవారానికి ఆయ‌న పాద‌యాత్ర 77వ రోజుకు చేరింది. అలాగే ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్‌కు చేరుకునే స‌రికి 1000 కిలోమీట‌ర్ల న‌డ‌క పూర్తి అవుతుంది.

నారా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లయ్యే సంద‌ర్భంలో ఆయ‌న‌పై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. లోకేశ్ న‌డ‌వ‌లేర‌ని, మ‌ధ్య‌లోనే ఆపేస్తా ర‌నే టాక్ వెల్లువెత్తింది. అయితే లోకేశ్ ప‌ట్టుద‌ల‌తో న‌డ‌క సాగిస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌ధానంగా లోకేశ్ గ‌మ‌నంలో పెట్టుకోవాల్సిన అంశం ఒక‌టి వుంది. ఏడాది చొప్పున న‌డిచి 4 వేల కిలోమీట‌ర్లను రీచ్ కావ‌డ‌మే ల‌క్ష్య‌మా? లేక ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డ‌మా? అనేది కీల‌కం.

ప్ర‌తి అడుగూ రాజ‌కీయంగా త‌న నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కాన్ని, అలాగే టీడీపీకి ఆద‌ర‌ణ‌ను పొంద‌గ‌లిగితేనే లోకేశ్ ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టు. లేదంటే సుదీర్ఘ పాద‌యాత్ర వృథా ప్ర‌యాస‌గానే మిగులుతుంది. పాద‌యాత్ర త‌న‌లో గొప్ప మార్పును తీసుకొచ్చేలా అడుగులు వేయాలి. పాద‌యాత్ర అంటే ఉద‌యాన్నే ఆరోగ్యం కోసం వాకింగ్ చేసిన‌ట్టు కాద‌ని లోకేశ్ గ్ర‌హించాలి. త‌న‌పై స‌మాజంలో సాగుతున్న నెగెటివ్ అంశాల్ని పోగొట్టుకునేలా లోకేశ్ న‌డ‌క వుండాలి.

ప‌ప్పు, పుల‌కేశి, అస‌మ‌ర్థుడ‌నే ముద్ర‌ల్ని తుడిచి పెట్టేలా పాద‌యాత్ర సాగాలి. వెయ్యి కిలోమీట‌ర్ల న‌డ‌క పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో … ఇంత వ‌ర‌కూ త‌న‌లో వ‌చ్చిన మార్పు ఏంటో ఆత్మావ‌లోక‌నం చేసుకోవాలి. జీవితం అంటే నిత్యం పాఠాలు నేర్చుకోవ‌డ‌మే. లోపాల్ని స‌రిదిద్దుకోడానికి సిద్ధం కాక‌పోతే రాజ‌కీయంలో, జీవితంలో ఎదుగుద‌ల ఆగిపోతుంద‌ని లోకేశ్ గ్ర‌హించాలి. త‌ప్పులు చేయ‌డం నేరం కాదు. వాటిని గుర్తించి, స‌రిచేసుకోక‌పోవ‌డ‌మే నేర‌మ‌వుతుంది.

పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌తి అడుగూ కీల‌క‌మైంది. 100, 200, 300….తాజాగా 1000 కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకోవ‌డం చిన్న విష‌యం కాదు. ఎందుకంటే లోకేశ్ అంటే సోష‌ల్ మీడియాలో క‌నిపించే నాయ‌కుడిగా ఇంత కాలం గుర్తింపు ఉండింది. అలాంటిది పాద‌యాత్ర ద్వారా ఒక్క‌సారిగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం గొప్ప అవ‌కాశం. త‌న‌లోని లోపాల‌ను, అలాగే ప్ర‌త్య‌ర్థుల న‌డ‌వ‌డిక‌లో త‌ప్పుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ, అలాంటివి తాను చేయ‌కూడ‌ద‌నే దృఢ‌చిత్తంతో ముంద‌డుగే వేయ‌డ‌మే ల‌క్ష్యంగా న‌డ‌క సాగించాలి.

ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం అంటే త‌న‌పై ప్ర‌తికూల అంశాల్ని పోగొట్టుకొంటూ, సానుకూల‌త‌ను పెంచుకోవ‌డ‌మే. యువ‌గళం పాద‌యాత్ర ప్ర‌జ‌ల‌పై ఏ మేర‌కు పాజిటివ్ ముద్ర వేస్తున్న‌దో లోకేశ్ నిత్యం తెలుసుకోవాలి. యువ‌గ‌ళం అడుగులు త‌న‌ను, టీడీపీని రాజ‌కీయంగా  వెనక్కి న‌డిపిస్తే ప్ర‌యోజ‌నం లేదు. ముందుకు న‌డిపిస్తే పాద‌యాత్ర స‌క్సెస్ అవుతున్న‌ట్టే. పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు చేరుకున్న సంద‌ర్భంగా రాజ‌కీయంగా చేరుకున్న మైలేజీపై టీడీపీ అత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.