చాలామంది చేస్తున్న పనే ఇది. ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన ఇలాంటి వాళ్లందరికీ కనువిప్పు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఉంటున్న ఓ మహిళ, తన కూతురు పెళ్లి కోసం లాకర్ లో 18 లక్షల రూపాయలు దాచుకుంది. కొన్నాళ్ల తర్వాత లాకర్ ఓపెన్ చేసి చూస్తే, ఆ కరెన్సీ నోట్లను చెద పురుగులు తినేశాయి.
జరిగిన ఘటనపై బ్యాంకులో ఫిర్యాదుచేసింది సదరు మహిళ. అయితే ఆమెకు ఎలాంటి పరిహారం చెల్లించలేమని బ్యాంకు స్పష్టం చేసింది. దీనికి కారణం లాకర్లలో కరెన్సీ నోట్లు భద్రపరచకూడదనే నిబంధన. చాలామందికి తెలియని విషయం ఇది.
చాలామంది తెలిసోతెలియకో తమ డబ్బును లాకర్లలో దాస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ డబ్బుకు ఎలాంటి వడ్డీ రాదు, పైగా డబ్బుకు ఏమైనా జరిగితే బ్యాంకుకు సంబంధం లేదనే విషయం కూడా తాజా ఘటనతో వెలుగులోకి వచ్చింది.
వరదలు, భూకంపం, అల్లర్లు, తీవ్రవాదుల దాడి, కస్టమర్ నిర్లక్ష్యం మొదలైన వాటి కారణంగా బ్యాంక్ లాకర్లోని విలువైన వస్తువులు పోయినా, దెబ్బతిన్నా, బ్యాంకు బాధ్యత వహించదు. ఆ నష్టాన్ని భర్తీ చేయదు.
కానీ అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కూలిపోవడం లేదా బ్యాంకు ఉద్యోగులు మోసపూరిత కార్యకలాపాలు వంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకొస్తుంది. అయితే ఇక్కడ కూడా వినియోగదారుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది.
లాకర్ కోసం కస్టమరు ఏడాదికి ఎంత అద్దె చెల్లిస్తాడో, ఆ అద్దెకు వంద రెట్లు మాత్రమే పరిహారంగా అందిస్తుంది బ్యాంకు. ఉదాహరణకు, వార్షిక లాకర్ ఛార్జీ వెయ్యి రూపాయలు అనుకుందాం, మీరు లాకర్లో ఉంచిన విలువైన ఆస్తుల ధరతో సంబంధం లేకుండా బ్యాంక్ లక్ష రూపాయలు మాత్రమే మీకు పరిహారం అందిస్తుందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాకర్లలో ఏం దాచాలో నిర్ణయం తీసుకోవాలి.
లాకర్ లోపల ఏముందో, అందులోని వస్తువుల విలువ ఎంతనే విషయాల్ని బ్యాంకులకు కస్టమర్ చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకులు ఆ వివరాలు అడగవు. కస్టమర్లు తమ లాకర్లోని వస్తువుల్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. అదే టైమ్ లో ఏదైనా ఆపద సంభవించి, పరిహారం కోసం ఎదురుచూసే టైమ్ లో కూడా లాకర్ లో ఏముందనేది బ్యాంకుకు అనవసరం.